బోయిన్ పల్లిలో పోలీసు డ్రెస్ వేసుకుని 5 లక్షలు కొట్టేశారు!

బోయిన్ పల్లిలో పోలీసు డ్రెస్ వేసుకుని  5 లక్షలు కొట్టేశారు!

పద్మారావునగర్​, వెలుగు:  పోలీసు డ్రెస్  వేసుకుని ఇద్దరు  రూ. 5 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ లోని బోయినపల్లి ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, డీఐ సర్దార్ నాయక్‌ తెలిపిన  ప్రకారం.. సికింద్రాబాద్‌లోని  గ్లోబల్ యాడ్స్ రేబాన్ట్  సంస్థలో ఒడిశాకు చెందిన మేనేజర్ గా బిక్రమ్ బెహరా అసిస్టెంట్ మేనేజర్ గా సత్య పాండా, అరుణ్ కుమార్ ఆఫీస్ బాయ్‌గా, పని చేస్తున్నారు.  వీరు బోయిన్ పల్లిలో ఉంటున్నారు.  శనివారం రాత్రి సంస్థకు చెందిన రూ. 5 లక్షలను అసిస్టెంట్ మేనేజర్ సత్య పాండాకు ఇవ్వమని మేనేజర్  బిక్రమ్ బెహెరా ఆఫీస్ బాయ్ అరుణ్ కుమార్‌‌తో  పంపాడు.  

రాత్రి 10 గంటల సమయంలో ఎంఎంఆర్ గార్డెన్ ఎదురుగా సర్వీస్ రోడ్డులో తనిఖీల పేరుతో పోలీసు డ్రెస్స్ లో  ఇద్దరు వ్యక్తులు ఉండి అరుణ్ కుమార్ ను ఆపారు.  డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సీ అడిగారు.  బ్యాగును చెక్​ చేసి అందులోని రూ. 5 లక్షలు తీసుకొని పోలీస్ స్టేషన్‌కు రావాలని అరుణ్ కుమార్ ను  పంపించారు.  ఇద్దరు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఈ విషయాన్ని అరుణ్ కుమార్ వెంటనే సంస్థ మేనేజర్‌‌కు  చెప్పాడు. మేనేజర్‌‌  పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా వారు నకిలీ పోలీసులని తేలింది.  సంస్థ మేనేజర్ బిక్రం బెహెరా ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.