భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్లో ఇన్ఫార్మర్లనే నెపంతో ఇద్దరిని మావోయిస్టులు హత్య చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బీజాపూర్జిల్లాలోని ఊసూరు పోలీస్స్టేషన్పరిధి నేలాకాంకేర్ గ్రామానికి శుక్రవారం రాత్రి మావోయిస్టులు వచ్చారు. వరుసకు మామా అల్లుడైన తిరుపతి సోడి(38), రవి కట్టం(25) ను మాట్లాడాలంటూ బయటకు పిలిపించారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ చితకబాదారు. స్థానికులు వారించినా వినకుండా కత్తులతో ఇద్దరిని మావోయిస్టులు పొడిచి చంపారు.
తిరుపతి సోడె సోదరుడు సీఆర్పీఎఫ్లో జవాన్. కాగా.. పనుల మీద తిరుపతి, రవి తరచూ అవుపల్లి, బీజాపూర్జిల్లా కేంద్రానికి వెళ్లి వస్తుంటారు. పోలీసులను కలిసి తమ దళాల సమాచారం అందిస్తున్నారనే అనుమానంతోనే హత్య చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటు న్నారు. మృతులతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు చెబుతున్నారు. తిరుపతి, రవి డెడ్ బాడీలను ఊసూరు ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించారు.
