కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో 47 మందికి వైద్య పరీక్షలు చేసింది తెలంగాణ ఆరోగ్య శాఖ. గాంధీ ఆసుపత్రిలో చేసిన ఈ పరీక్షల్లో 45 మందికి కరోనా లక్షణాలు నెగిటివ్ గా వచ్చినట్టు బుధవారం ఓ మీడియా బులెటిన్ విడుదల చేసింది.
కోవిడ్-19 (కరోనా వైరస్) మీద ఈ ఉదయం వెల్లడించిన రిపోర్ట్ లో… మంగళవారం 47 శాంపిల్స్ పై వైద్య పరీక్షలు చేయగా.. అందులోని 45 శాంపిల్స్ లో కరోనా లేనట్టు తేలింది. మిగిలిన రెండు కేసులను మెరుగైన పరీక్షల కోసం పూణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపించారు. అందుకు సంబంధించిన రిపోర్ట్ గురువారం రావొచ్చని తెలిపింది.
వైరస్ లక్షణాలున్న ఇద్దరూ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు లోనే ఉంచారు. ఇద్దరిలో ఒకరు ఇటలీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తి కాగా.. మరొకరు అతనితో పాటు సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. మిగతా 45 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, వారిని మరో 14 రోజుల పాటు వారి ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రకటనలో తెలిపింది ఆరోగ్య శాఖ .
అయితే దుబాయ్ నుంచి వచ్చిన సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్ కు చెందిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రస్తుతం అతను కూడా ఐసోలేషన్ వార్డులోనే ఉన్నట్టు బులెటిన్ లో పేర్కొంది.

