ఒకే చోట రెండు స్కూళ్లు.. పుట్టలు పుట్టలుగా అవకతవకలు

ఒకే చోట రెండు స్కూళ్లు.. పుట్టలు పుట్టలుగా అవకతవకలు
  • ఏపీలో విద్యాశాఖ నిర్వాకం
  • విచారణలో తవ్వేకొద్దీ పుట్టలు పుట్టలుగా బయపడుతున్న అక్రమాలు

అమరావతి: ఒకేచోట.. అది కూడా పక్క పక్కనే రెండు ఉర్దూ స్కూళ్లు నిర్వహిస్తూ.. ప్రజాధనాన్ని వృధా చేస్తున్న వైనం విద్యాశాఖ నిర్వాకం ఇది. గుట్టు చప్పుడు కాకుండా చాలా కాలంగా నడుస్తున్న వ్యవహారం ఇటీవల ఓ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పోస్టులు కాపాడుకునేందుకు మరియు నిర్వహణ నిధులు బొక్కేసేందుకు చాలా తెలివిగా కట్ర చేసి ఒకే చోట రెండు స్కూళ్లు నడుపుతున్నారు. విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ సొంత నియోజకవర్గానికి సమీపంలో ఉన్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరువెళ్ల మండలం కేంద్రంలో జరుగుతున్న వ్యవహారం ఇది.  పై ఫోటోలో ఉన్న రెండు స్కూళ్లు వేర్వేరుగా కనిపిస్తూ.. చూసే వారిని తప్పుదోవ పట్టిస్తాయి. చివరకు ఉన్నతాకారులు వచ్చినా రెండు బాల బాలికలకు వేర్వేరు స్కూళ్ల కాబోలు అని మిన్నకుండిపోతారు. పూర్తిగా విచారిస్తే చాలా కాలంగా ఇక్కడి టీచర్లు అధికారుల సహకారంతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్న వైనం బయటపడుతుంది. కానీ ఎవరూ ఇంత వరకు గుర్తించిన దాఖలాలు కనిపించడం లేదు. ముస్లిం బాల బాలికలకు వేర్వేరుగా స్కూళ్లు అవసరమైతే కొనసాగించొచ్చు. కానీ రెండు చోట్లా కో ఎడ్యుకేషన్ ఎందుకు జరుపుతున్నారనేది సమాధానం లేని ప్రశ్న.
రెండు స్కూళ్లలో ఐదుగురు చొప్పున టీచర్లు
బాలుర పాఠశాలలో 168 మంది విద్యార్థులకు ఒక హెడ్మాస్టర్ తోపాటు ఐదుగురు టీచర్లు ఉండగా.. బాలికల పాఠశాలలో 148 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లు ఉన్నారు. రెండు స్కూళ్లలో బాలురు మరియు బాలికలు ఉన్నారు. పేరుకు బాలురు, మరియు బాలికలకు ప్రత్యేక పాఠశాల అని ఉన్నాయి.  నిర్వహణ అంతా ఒక్కటే. అడ్మిషన్లు అందరికీ ఇస్తున్నారు. రెండు స్కూళ్లను విలీనం చేసి ఒకటిగా నిర్వహిస్తే సరిపోతుంది. అయితే ఇక్కడే టీచర్లు, అధికారులు కుమ్మక్కయిపోయారు. రెండు స్కూళ్లను విలీనం చేస్తే.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మిగులు టీచర్లను వేరే స్కూళ్లకు బదిల చేస్తారు. ఏటా నిర్వహణ పేరుతో వేర్వేరుగా వచ్చే నిధులు ఒక్కసారే వస్తాయి. సరిగ్గా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే రెండు స్కూళ్లకు వేర్వేరుగా వచ్చే నిధులు ఎక్కువ. అందుకే ఇటు పోస్టులు.. ఇటు నిధులను బొక్కేసేందుకు టీచర్లు, విద్యాశాఖ అధికారులు కుమ్ముక్కయినట్లు స్పష్టమవుతోంది. 

ఒకే బాలికకు రెండు చోట్ల అడ్మిషన్-మూడేళ్లు హాజరు వేసి మధ్యాహ్న నిధులు స్వాహా 

శిరువెళ్ల మండలం కేంద్రంలోని ఉర్దూ బాలుర పాఠశాలలో చదివిన చింతకుంట ఫర్హాన్ అనే బాలిక.. పక్కనే ఉన్న బాలికల పాఠశాలలో కూడా చదివినట్లు హెడ్మాస్టర్ తప్పుడు రికార్డు షీట్ తయారు చేశారు. 2012లో బాలుర పాఠశాలలో రెండో తరగతిలో చేరిన ఈ బాలిక 2015 మరియు 16 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ డ్రాపౌట్ అయినట్లు రికార్డుల్లో ఉంది. ఇదే విద్యార్థిని బాలికల పాఠశాలలో 2012లో మూడో తరగతిలో చేరినట్లు అడ్మిషన్ రిజిస్టర్ ను ట్యాంపరింగ్ చేసి 2015లో ఐదో తరగతి పూర్తి చేసినట్లు హెడ్మాస్టర్ తప్పుడు రికార్డు షీట్ జారీ చేశారు. మదరసాలలో ఖురాన్ విద్యను చదువుకుంటున్న వారి పేర్లు కూడా పాఠశాలలో నమోదు చేసుకుని ఒకవైపు పోస్టులు కాపాడుకుంటూ.. ఇంకో వైపు అదనంగా వస్తున్న నిధులతో విద్యాశాఖ అధికారులను సంతృప్తి పరిచినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. వీటిపై ఆరోపణలు గుప్పుమనడంతో బీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సతీష్ కుమార్ సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలు తెలుసుకొని బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడంతో అంతర్గతంగా ఉన్న ఆరోపణల వ్యవహారం బయటకు పొక్కింది. ఏకంగా శిరివెళ్ల పోలీసు స్టేషన్లో ఎంఇఓ మహబూబ్ బాష, హెడ్మాస్టర్ చాంద్ బాష, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పై  కేసు నమోదు కావడంతో విద్యాశాఖ వ్యవహారం రచ్చరచ్చ అయింది. 
తీగ లాగితే డొంకంతా కదిలింది

బాల బాలికలకు వేర్వేరుగా రెండు స్కూళ్లు అవసరమే. కానీ ఇక్కడ పేరుకే అన్నట్లుగా వేర్వేరు బోర్డులు పెట్టి.. రెండు చోట్ల కూడా కో ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంటే.. సామాన్యులకు ఎవరికైనా ఇట్టే అనుమానాలు కలుగుతాయి. నిబంధనలు తెలియని వారైతే రెండు ఒకే బోర్డు పెట్టొచ్చు కదా అని తేలిగ్గా అనేస్తారు. కానీ లొగుట్టు పెరుమాళ్లకే ఎరుక అన్నట్లు ఏళ్లుగా ప్రజాధనాన్ని వృధా చేస్తుంటే ఏటా విచారణ చేస్తున్న విద్యాధికారులు గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. టీచర్లు, స్థానిక మండల విద్యాశాఖ అధికారులు కుమ్మక్కయి నిధులు బొక్కేసేందుకు ఈ తంతు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలాంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఒక ఫిర్యాదుతో బయటకొచ్చింది. బహుజన టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.సతీష్ కుమార్ సమాచార హక్కు చట్టం కింద అన్ని వివరాలపై లేఖాస్త్రాలు సంధించడంతో దిమ్మదిరిగేలా అవకతవకలు పుట్టలుపుట్టలుగా బయటకొచ్చాయి. రికార్డులన్నీ ట్యాంపరింగ్ (అనేకచోట్ల.. అనేక సార్లు దిద్దినట్లు) చేసినట్లు రిజిస్టర్లన్నీ వేర్వేరుగా నమోదు చేస్తున్నట్లు రెడ్ హ్యాండెడ్ గా తేలిపోయింది. 

పాఠశాలల్లో విచారణ చేపట్టిన ఉర్దూ డి.ఐ

రెండు స్కూళ్లలో ఒకే పేర్లు రాసుకుని మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, స్కాలర్ షిప్పులు స్వాహా చేశారన్న ఆరోపణల నేపధ్యంలో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు కర్నూలు జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (ఉర్దూ) కర్నూలు ఆదాం బాష విచారణ చేపట్టారు. విచారణలో తవ్వే కొద్దీ అక్రమాలు పుట్టలు పుట్టలుగా వెలుగులోకి వస్తున్నాయి. శిరివెళ్ల గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఒకేచోట రెండు ఉర్దూ పాఠశాలలు నెలకొల్పడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై  ప్రశ్నించగా గతంలో రెండు స్కూల్స్ ఒకేచోట ప్రార్ధన సమావేశం నిర్వహించినట్లు ఇరువురు హెచ్.ఎం లు ఒప్పుకున్నారు. ఉర్దూ బాలికల పాఠశాలలో రికార్డ్ టాంపరింగ్ చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ అయింది. కన్సాలిడేటెడ్ రిజిస్టర్ మరియు రికార్డ్స్ షీట్ లలో పాఠశాలకు హాజరైన దినాలు మరియు మార్కుల జాబితాకు ఎక్కడ కూడా పొంతనలులేవు. అన్నీ టాంపరింగ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో విచారణ అధికారి అన్ని రికార్డులను సీజ్ చేసినట్లు సమాచారం. విచారణాధికారి ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. టీచర్ పోస్టులు పెంచుకోవడానికి కుట్ర చేసి..దొంగ పేర్లు వ్రాసుకొని మధ్యాహ్న భోజనం నిధులు.. ఏటా వచ్చే నిర్వహణ నిధులను పలు రకాలుగా ప్రజాధనం వృధా చేసినట్లు తేలినందున బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. విద్యాధికారులు సీజ్ చేసిన రికార్డుల ఆధారంగా బయటకొచ్చిన వాస్తవాలు, ఆరోపణలు రుజువైనందున బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది  వేచి చూడాల్సిందే.