సరూర్ నగర్ పరువు హత్య కేసులో ..ఇద్దరికి యావజ్జీవ శిక్ష

సరూర్ నగర్ పరువు హత్య కేసులో ..ఇద్దరికి యావజ్జీవ శిక్ష

ఎల్ బీనగర్, వెలుగు :  సరూర్ నగర్ పరువు హత్య కేసులో ఇద్దరు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ ఎల్బీ నగర్​లోని రంగారెడ్డి జిల్లా 7వ అదనపు జిల్లా సెషన్స్​ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. గతేడాది మే 4న సరూర్ నగర్​లో నడిరోడ్డుపై పట్టపగలు జరిగిన పరువు హత్య ఘటన సంచలనం సృష్టించింది. ఐడీపీఎల్ ​గురుమూర్తి నగర్‌‌కు చెందిన బిల్లిపురం నాగరాజు(25) మార్కెటింగ్ ప్రొఫెషనల్. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆశ్రీన్​ సుల్తానా, నాగరాజు ఒకే స్కూల్‌, కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

అయితే, నాగరాజును పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని సుల్తానాను ఆమె సోదరుడు సయ్యద్ ​మోబిన్ ​అహ్మద్ (28) వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సుల్తానా ఇంటి నుంచి వెళ్లిపోయి నాగరాజును పెండ్లి చేసుకుంది. మతం కూడా మార్చుకుంది. తర్వాత వారిద్దరూ సరూర్​నగర్​లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. కక్ష గట్టిన అహ్మద్ వారి కోసం గాలించాడు. మొబైల్​లో రిజిస్టర్ చేసి ఉన్న ఇ–మెయిల్ ఐడీ సాయంతో ఫైండ్ మై డివైజ్​ ఆప్షన్​ను వాడుకుని వారి ఆచూకీ తెలుసుకున్నాడు. బైకుపై వెళ్తున్న నాగరాజుపై స్నేహితులతో కలిసి ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేశాడు. పక్కనే ఉన్న సుల్తానా తన భర్తను చంపొద్దని కాళ్ల మీద పడి వేడుకున్నా వదలకుండా హత్య చేశారు. కేసులో విచారణ అనంతరం ఇద్దరు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. 

బాలికకు లైంగిక వేధింపులు..  నిందితుడికి 20 ఏండ్ల జైలు

జీడిమెట్ల, వెలుగు: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి కూకట్ పల్లి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. వికారాబాద్​ జిల్లా మోత్కుపల్లి గ్రామానికి చెందిన గుండాల మహిపాల్​ రెడ్డి  (48) బతుకు దెరువు కోసం సిటీకి వచ్చి కూకట్ పల్లిలోని  దత్తాత్రేయ కాలనీలో ఉంటూ లేబర్​గా  పనిచేసేవాడు. 2019, జూన్​లో ఓ బాలిక(7)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  గమనించిన చుట్టుపక్కవారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించగా, నిందితుడిని రిమాండ్​కు తరలించారు. కేసు విచారణ అనంతరం మహిపాల్ రెడ్డికి 20 ఏండ్ల  జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది.