ఈద్గా కోసం హిందూ అక్కాచెల్లెల భూదానం

ఈద్గా కోసం హిందూ అక్కాచెల్లెల భూదానం

కాశీపూర్/ ఉత్తరాఖండ్: తండ్రి చివరి కోరిక తీర్చడం కోసం తమ స్వంత వ్యవసాయ భూమిని ఈద్గా కోసం దానం చేశారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు. దాదాపు రూ.1.5 కోట్ల విలువైన భూమిని సరోజ, అనిత అనే అక్కాచెల్లెళ్లు ఈద్గా కమిటీకి అప్పగించారు. మత కలహాల పేరుతో నిత్యం దేశంలో ఏదో ఓ చోట హింస చెలరేగుతోన్న ప్రస్తుత తరుణంలో... ఈ అక్కా చెల్లెళ్లు చేసిన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. నిన్నటి రంజాన్ పండగ వేళ అక్కడి ముస్లింలందరూ అక్కా చెల్లెళ్ల చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ భ్రజందన్ ప్రసాద్ కోసం ప్రార్థన చేశారు. 

ఇక వివరాల్లోకి వెళ్తే... ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లా కాశీపూర్ అనే చిన్న పట్టణంలో భ్రజందన్ ప్రసాద్ రస్తోగి అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు  సరోజ, అనిత అనే ఇద్దరు కూతుళ్లు, రాకేశ్ రస్తోగి అనే కుమారుడు ఉన్నారు. భ్రజందన్ ప్రసాద్ రస్తోగి ఇద్దరు కూతుళ్లు వృత్తి రీత్యా ఢిల్లీ, మీరట్  ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. భ్రజందన్ ప్రసాద్ రస్తోగికి తన వ్యవసాయ భూమిలోని కొంత స్థలాన్ని స్థానికంగా ఉన్న ఈద్గా విస్తరణ కోసం ఇవ్వాలనే కోరిక ఉండేది. ఈ విషయాన్ని ఆయన తన సమీప బంధువులకు చాలా సార్లు చెప్పాడు కానీ తన పిల్లలతో చెప్పలేకపోయాడు. అయితే 20 ఏళ్ల కిందట భ్రజందన్ ప్రసాద్ చనిపోయాడు. దీంతో ఆ విషయం అంతటితో మరుగున పడింది. కానీ ఇటీవలే  సరోజ, అనితలకు తమ నాన్న చివరి కోరిక గురించి తెలిసింది. దీంతో వారిద్దరూ  గ్రామంలో ఉంటున్న తమ సోదరుడు రాకేశ్ కు విషయం చెప్పి ఒప్పించారు. అనంతరం అందరు కలిసి దాదాపు 10 గుంటల భూమిని ఈద్గాకు అప్పగించారు. తమ నాన్న చివరి కోరిక తీర్చినందుకు చాలా ఆనందంగా ఉందని సరోజ, అనిత చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం...

రాహుల్ తెలంగాణ టూర్ పూర్తి షెడ్యూల్

వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించిన మంత్రి రోజా