గోదావరి-కృష్ణా లింక్ చర్చలు ముందుకు సాగట్లే

గోదావరి-కృష్ణా లింక్ చర్చలు ముందుకు సాగట్లే
  • వేర్వేరుగానే ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల ప్రతిపాదనలు
  • సమావేశం వాయిదా పడటంతో గందరగోళం

హైదరాబాద్‌‌, వెలుగు: గోదావరి–కృష్ణా లింక్‌‌పై తెలంగాణ, ఏపీ ఇంజనీర్ల ఉమ్మడి భేటీ విషయం గందరగోళంలో పడింది. అసలు సమావేశం జరుగుతుందా, లేదా, ఉమ్మడి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారా, ఎవరికివారే నివేదికలిస్తారా అన్న అంశాలపై స్పష్టత కరువైంది. ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు ఈనెల 2, 3 తేదీల్లో జల సౌధలో భేటీ కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో రద్దయింది. ప్రతిపాదనలు సిద్ధంకానందునే సమావేశం రద్దయినట్టు చెబుతున్నా.. దాని వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి సమావేశం కోసం ఏపీ ఇంజనీర్లు రెండో తేదీన సాయంత్రమే హైదరాబాద్‌‌కు చేరుకున్నారు. కానీ ఉమ్మడి భేటీ జరగకపోవడంతో.. మూడో తేదీన వారే అంతర్గత సమావేశం నిర్వహించుకున్నారు. కొందరు ఇంజనీర్లు పోలవరం అథారిటీ దగ్గర సమావేశమైనట్టు కూడా తెలిసింది. మరోవైపు తెలంగాణ ఇంజనీర్లు కూడా సమావేశమై ప్రతిపాదనలపై కసరత్తు చేసినట్టు సమాచారం.

ఉమ్మడి సర్వే ఉంటుందా?

ఇంజనీర్ల సమావేశం తర్వాత గోదావరి నది నుంచి నీటిని తరలించాల్సిన పాయింట్లపై ఉమ్మడిగా సర్వే చేయాలని కూడా భావించారు. ఆ తర్వాత లైడార్‌‌ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఇంజనీర్ల సమావేశం వాయిదా పడటంతో ఈ మొత్తం వ్యవహారం ఆగిపోయింది. ఈ నెల పదో తేదీ తర్వాత ఉమ్మడి ఇంజనీర్ల భేటీ నిర్వహించవచ్చని, అప్పటికీ వీలుకాకపోతే విడివిడిగానే ప్రతిపాదనలు సిద్ధం చేసే అవకాశముందని అంటున్నారు. జాయింట్‌‌ సర్వే చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎవరికి వారే సర్వే నివేదికలు సమర్పించి, రాజకీయ నిర్ణయం మేరకు వాప్కోస్‌‌తో తుది సర్వే చేయిస్తే సరిపోతుందని కొందరు ఇంజనీర్లు పేర్కొంటున్నారు.