- మృతుల్లో ఒకరు బీటెక్, మరొకరు డిగ్రీ విద్యార్థులు
- మరో ఆరుగురికి గాయాలు
- ఓవర్ స్పీడ్‌తో అదుపుతప్పిన వెహికల్
- కారు ముందు భాగం నుజ్జునజ్జు
- హైదరాబాద్ మేడిపల్లిలో ఘటన
మేడిపల్లి, వెలుగు: హైదరాబాద్ మేడిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న కారు అదుపుతప్పి ఫ్లై ఓవర్ పిల్లర్ను ఢీకొట్టింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ యాక్సిడెంట్లో ఇద్దరు స్టూడెంట్లు స్పాట్లోనే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వనపర్తి జిల్లాకు చెందిన వికిత్.. గీతం వర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్, సాయివరుణ్.. ఓయూ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. వీళ్లు పోచారంలోని సద్భావన టౌన్ షిప్ లో ఉంటున్నారు.
వీరితో పాటు సీఎంఆర్ కాలేజీలో చదువుతున్న వెంకట్, రాకేశ్.. అనురాగ్, సిద్ధార్థ్ కాలేజీల్లో చదువుతున్న అభినన్, యశ్వంత్ రెడ్డి, సాత్విక్, హర్షవర్ధన్ వనపర్తి పట్టణానికి చెందినవాళ్లే. వీళ్లంతా గతంలో ఒకే స్కూల్లో చదువుకున్నారు. మౌలాలిలో నివాసం ఉంటున్న తమ ఫ్రెండ్ అమెరికా నుంచి రావడంతో కలిసేందుకు మంగళవారం సాయంత్రం వీళ్లంతా మహీంద్రా ఎస్యూవీ 700 కారులో బయల్దేరారు. అర్ధరాత్రి పోచారంలో ఉంటున్న సాయి వరుణ్ దింపడానికి బోడుప్పల్ నుంచి పోచారం వైపు బయలుదేరారు. రాత్రి 2 గంటల సమయంలో వరంగల్ హైవేపై మేడిపల్లి వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న 2 బైక్ లను తప్పించే క్రమంలో నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 97ను ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. డ్రైవ్ చేస్తున్న వికిత్, పక్కనే ఉన్న సాయి వరుణ్ అక్కడికక్కడే చనిపోయారు. వెంకట్, రాకేశ్‌కు తీవ్రగాయాలు కాగా, అభినన్, యశ్వంత్ రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. మరో ఇద్దరు సాత్విక్, హర్షవర్ధన్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
