ఇద్దరు టీఎస్‌పీఎస్సీ మెంబర్లు రిజైన్​

ఇద్దరు టీఎస్‌పీఎస్సీ మెంబర్లు రిజైన్​

హైదరాబాద్, వెలుగు: టీఎస్‌పీఎస్సీ మెంబర్లు లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు. రెండు రోజులుగా అపాయింట్‌మెంట్ అడుగుతున్నా రాజ్‌భవన్ నుంచి సరైన స్పందన రాలేదని, దీంతో లేఖలను గవర్నర్‌‌కు పంపినట్లు వారు చెప్పారు. తాను 30 నెలలుగా కమిషన్ మెంబర్‌‌గా ఉన్నానని, ఇందుకు అవకాశమిచ్చిన మాజీ సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు చెప్తున్నానని రవీందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తాము ఉద్యమకారులమని, ఎప్పుడూ నిరుద్యోగుల పక్షమే నిలబడతామని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ఇద్దరు వ్యక్తుల తప్పిదంతో కమిషన్ మనుగడకే ముప్పు వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలాంటి సంబంధం లేని సభ్యులు సైతం అపవాదు మోయాల్సి వచ్చిందని చెప్పారు. టీఎస్‌పీఎస్సీలో సరిపోను సిబ్బంది లేకున్నా, ఉన్నవారిని కష్టపెట్టి నియామక ప్రక్రియను వేగవంతం చేశామని చెప్పుకొచ్చారు. కొంతమంది వ్యక్తుల స్వార్థపూరిత ఆలోచనలకు అనుగుణంగా తాము పనిచేయలేదన్న కారణంతో.. సంస్థలో జరిగిన పరిణామాలను తమకు ఆపాదించి దోషులుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గురువారమే మరో మెంబర్ సత్యనారాయణ రాజీనామా లేఖను గవర్నర్‌‌కు పంపారు. ఇంకో ఇద్దరు మెంబర్లు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. వారు కూడా నేడో రేపో రాజీనామాలు చేసే అవకాశముంది.