
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రెవిన్యూ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై వేటు పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ తో బ్యాంకాక్ లో దొరికి వీఆర్ఏతో పాటుగా భారీగా భూ మాఫియా, అక్రమ నిర్మాణాలకు సహకరించిన రెవిన్యూ ఇన్స్పెక్టర్ ను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సస్పెండ్ చేశారు. తాజాగా మరో ఇద్దరు వీఆర్ఏలు కూడా సస్పెండ్ అయ్యారు.
తాజాగా కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు రెవిన్యూ అధికారులు. అయితే ఈ అక్రమాల ఏరువేతలో భాగంగా మరో ఇద్దరు సిబ్బంది బాగోతం బయటపడింది. అక్రమ నిర్మాణాల విషయంలో నాగరాజు, దేవకుమార్ అనే ఇద్దరు వీఆర్ఏలు ఫోన్ పే ద్వారా 50 వేల రూపాయలను లంచం తీసుకున్నట్లుగా జిల్లా అధికారులకు ఫిర్యాదు అందింది.
దీంతో రెవెన్యూ ఉన్నత అధికారులు దర్యాప్తు చేపట్టి వారిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కుత్బుల్లాపూర్ రెవిన్యూ కార్యాలయంలో నెల రోజుల వ్యవధిలోనేల నలుగురు వీఆర్ఏలు సస్పెండ్ కు గురయ్యారు.