బైకులు, కార్ల ధరలు పెరగబోతున్నాయ్

బైకులు, కార్ల ధరలు పెరగబోతున్నాయ్
  • స్టీల్‌‌, ప్లాస్టిక్‌‌ ధరలు పెరుగుతుండడంతో తప్పడంలేదంటున్న కంపెనీలు
  • వేరియంట్ బట్టి ధరల పెంపులో మార్పులు    జనవరిలోనూ  ధరలు పెరిగాయి
  • ఇప్పటికే ప్రకటించిన మారుతి, నిస్సాన్‌‌, డాట్సన్‌‌, రెనాల్ట్‌‌, హీరో, రాయల్‌‌ఎన్‌‌ఫీల్డ్‌‌

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: ఏప్రిల్‌‌ 1 నుంచి కార్లు, టూ–వీలర్ల ధరలు పెరగనున్నాయి. గ్లోబల్‌‌గా స్టీల్, ప్లాస్టిక్‌‌, అల్యూమినియం వంటి ముడిసరుకుల ధరలు పెరుగుతుండడంతో,  ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని వెహికల్‌‌ తయారీ కంపెనీలు చూస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్‌‌ వంటి పెద్ద సంస్థలు ధరలను పెంచుతామని ప్రకటించాయి. మిగిలిన కంపెనీలు కూడా వీటి దారిలోనే నడిచే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరిలో కూడా కంపెనీలు తమ  వెహికల్స్‌‌ ధరలను పెంచాయి. మరోవైపు డీజిల్‌‌ ధరలు రికార్డ్‌‌ స్థాయిలకు చేరుకోవడంతో కంపెనీల ట్రాన్స్‌‌పోర్టేషన్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ భారాన్ని కూడా కస్టమర్లకు మరల్చాలని చూస్తున్నాయి. 
కార్లు ఖరీదవుతాయి..
ధరల పెంపు మోడల్స్‌‌, వేరియంట్స్‌‌ను బట్టి వేరు వేరుగా ఉంటుందని మారుతి సుజుకీ ప్రకటించింది.  ‘ఇన్‌‌పుట్ కాస్ట్‌‌(రామెటీరియల్స్‌‌, ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌ ఖర్చులు వంటివి) పెరుగుతుండడంతో గత ఏడాది కాలం నుంచి  కంపెనీ వెహికల్‌‌ ధరలు పెరుగుతున్నాయి. వచ్చే నెల 1 నుంచి ఈ అదనపు ఖర్చులను కస్టమర్లకు బదిలీ చేయనున్నాం’ అని మారుతి  ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో కంపెనీ తన వెహికల్‌‌ ధరలను పెంచింది. ఆ టైమ్‌‌లో రూ. 34 వేల వరకు ధరలను పెంచింది. నిస్సాన్‌‌, డాట్సన్‌‌ కార్ల ధరలు  ఏప్రిల్‌‌ 1 నుంచి పెరగనున్నాయి. ‘ఆటో కాంపోనెంట్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ భారాన్ని గత కొన్ని నెలల నుంచి కంపెనీనే భరిస్తూ వచ్చింది. ప్రస్తుతం వెహికల్‌‌ ధరలను పెంచాలని చూస్తున్నాం. వేరియంట్‌‌ను బట్టి ధరల పెంపులో మార్పులుంటాయి’ అని నిస్సాన్‌‌ ఇండియా ఎండీ రాకేష్‌‌ శ్రీవాత్సవ అన్నారు. రెనాల్ట్‌‌ కూడా తన కార్ల ధరలను పెంచనుంది. ఇన్‌‌పుట్‌‌ కాస్ట్ పెరుగుతుండడంతో ధరలను పెంచక తప్పడం లేదని ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో కూడా కంపెనీ తన కార్ల ధరలను పెంచింది. ఆ టైమ్‌‌లో సుమారు రూ. 28 వేల వరకు వెహికల్‌‌ ధరలను పెంచింది. ‘స్టీల్‌‌, అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి రామెటీరియల్స్‌‌ ధరలు పెరుగుతుండడంతో వెహికల్‌‌ ధరలను పెంచుతున్నాం’ అని రెనాల్ట్‌‌ ఇండియా ప్రకటించింది. మిగిలిన కార్ల కంపెనీలు కూడా ధరలను పెంచాలని చూస్తున్నాయి.  మరోవైపు డీజిల్‌‌ ధరలు పెరుగుతున్నాయి. దీంతో  కంపెనీల ట్రాన్స్‌‌పోర్టేషన్ కాస్ట్‌‌ కూడా పెరుగుతుండడంతో రిటైల్‌‌ లెవెల్లో వెహికల్స్‌‌ ఖరీదవుతున్నాయి.  ట్రాక్టర్లను తయారు చేసే ఎస్కార్ట్స్‌‌ కూడా ఏప్రిల్ 1 నుంచి ధరలను పెంచుతామని ప్రకటించింది. ‘రామెటీరియల్స్‌‌ ధరలు పెరుగుతుండడంతో ఎస్కార్ట్స్‌‌ అగ్రీ మెషినరీ(ఈఏఎం) డివిజన్ వచ్చే నెల1 నుంచి ధరలను పెంచనుంది’ అని ఓ స్టేట్‌‌మెంట్‌‌లో ఎస్కార్ట్స్‌‌ పేర్కొంది. 
ఈ ఏడాది ఇది రెండోసారి..
1) కంపెనీలు ఈ ఏడాది వెహికల్‌‌ ధరలను పెంచడం ఇది రెండోసారి.  జనవరిలో కూడా  వెహికల్‌‌ ధరలను పెంచాయి.
2) గ్లోబల్‌‌గా మెటల్స్‌‌ కొరత నెలకొనడంతో  రామెటీరియల్స్‌‌ ధరలు పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు తమ వెహికల్‌‌ ధరలను పెంచాలనుకుంటున్నాయి.
3) డీజిల్‌‌ ధరలు కూడా రికార్డ్‌‌ స్థాయిలకు చేరుకుంటుండడంతో కంపెనీల ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌, ఇతర ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని చూస్తున్నాయి.
4) కరోనా వలన డిమాండ్ పడిపోయినప్పటికీ కిందటేడాది వెహికల్‌‌ ధరలను కంపెనీలు పెంచాయి. బీఎస్‌‌4 నుంచి బీఎస్‌‌6 నిబంధనలకు మారడంతో ఈ ధరల పెంపును చేపట్టాయి.

బైక్‌‌ల ధరలు పెరుగుతాయి..
ముడిసరుకుల ధరలు పెరుగుతుండడంతో తమ బైక్‌‌లు, స్కూటర్ల ధరలను పెంచక తప్పడం లేదని టూ వీలర్‌‌‌‌ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌‌ పేర్కొంది. వచ్చే నెల 1 నుంచి ఈ ధరల పెంపు ఉంటుందని తెలిపింది. కస్టమర్లపై భారాన్ని తగ్గించేందుకు ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నామని పేర్కొంది. ‘మోటర్‌‌‌‌సైకిల్స్‌‌, స్కూటర్ల ఎక్స్‌‌షోరూమ్‌‌ ధరలలో పెరుగుదల ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది’ అని హీరో ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. ధరలు ఎంత వరకు పెరుగుతాయో కంపెనీ ప్రకటించలేదు. టూ వీలర్‌‌‌‌ ధరలు సుమారు రూ. 2,500 వరకు పెరగొచ్చని అంచనా. ఈ పెంపు కూడా మోడల్స్‌‌ను బట్టి మారుతుంది.  తాజాగా ఇంటర్‌‌‌‌సెప్టర్‌‌‌‌  650, కాంటినెంటల్‌‌ జీటీ 650 వంటి మోడల్స్‌‌ను తీసుకొచ్చిన  రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌ కూడా తమ వెహికల్‌‌ ధరలను పెంచనుంది.