రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఆ యువకులు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్థానికంగా తీవ్ర శోకం అలుముకుంది.

సిరిసిల్ల కరకట్ట వద్ద ఉన్న రామప్ప ఆలయ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన 18 ఏళ్ల హరిచరణ్ గౌడ్, అలాగే చిర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన 17 ఏళ్ల మణికంఠగా పోలీసులు గుర్తించారు.ఈత కోసం నీటిలోకి దిగిన ఈ ఇద్దరు యువకులు.. నీటి లోతును అంచనా వేయలేక మునిగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కళ్లముందే తిరిగిన బిడ్డలు.. ఇలా విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు స్థానికులను తీవ్రంగా చలింపజేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.