- ఇద్దరు నిందితుల రిమాండ్
ఘట్ కేసర్, వెలుగు : ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడి చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్ అయ్యారు. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. మహబూబ్ నగర్ కు చెందిన దేవరకొండ సాయితేజ(20) మియాపూర్ కు చెందిన ఉజ్జయిని ఆకాశ్(20) లైన్ లైన్ గేమ్ లు ఆడేందుకు అలవాటు పడ్డారు. ఈజీగా మనీ సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ లకు ప్లాన్ చేశారు. వీరు గత నెల 16న ఘట్ కేసర్ టౌన్ పరిధి కొండాపూర్ లో దారబోయిన రేణుక టీ స్టాల్ వద్దకు వెళ్లి సిగరెట్లు కావాలని అడిగారు. దీంతో ఆమె తెచ్చేందుకు వెళ్తుండగా మెడలోంచి చైన్ లాక్కొని పరార్ అయ్యారు.
అనంతరం యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో ఓ మహిళ మెడలోంచి చైన్ లాగేందుకు ప్రయత్నించగా రాకపోవడంతో పరుగు తీశారు. బాధితుల ఫిర్యాదులతో సీసీ ఫుటేజ్ ల ఆధారంగా నిందితులు ప్రయాణించిన హోండా యాక్టివాను పోలీసులు గుర్తించారు. ఘట్ కేసర్ టౌన్ శివారెడ్డి గూడ లోని హనుమాన్ టెంపుల్ వద్ద పోలీసులు గురువారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు నిందితులు అటువైపు నుంచి వెళ్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకొని విచారించారు. చోరీ చేసింది తామేనని నిందితులు అంగీకరించారు. ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
