కుమార్తె కెప్టెన్ అయినా.. తల్లిదండ్రులకు తప్పని కూలీ కష్టాలు

కుమార్తె కెప్టెన్ అయినా.. తల్లిదండ్రులకు తప్పని కూలీ కష్టాలు

పేద కుటుంబంలో పెట్టిన అష్టమ్ ఉరావ్ ఎన్నో కష్టాలు పడి భారత అండర్ 17 మహిళల ఫుట్ బాల్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది. తల్లిదండ్రులు కూలీ పని చేస్తే కానీ కడుపు నిండని పరిస్థితుల్లోనూ నిరాశ చెందకుండా ఆమె చూపించిన ప్రతిభ ఎనలేనిది. కానీ ఆమె విజయం సాధించినా ఆ తల్లిదండ్రులు కూలీ పని చేయడం తప్పడం లేదు. ఆమె విజయం వారి జీవితాలను ఏ మాత్రం మార్చలేకపోయింది. 

అష్టమ్ ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందింది. అయితే ఆమె విజయాన్ని చూసేందుకు ఆ ఊర్లో ఒక్కరింట్లోనూ టీవీ గానీ, వెళ్లడానికి సరైన రోడ్డు గానీ లేవు. అది తెలుసుకున్న అధికారులు ఇటీవలే టీవీ, డీటీహెచ్‌ కనెక్షన్‌, ఇన్వర్టర్‌, కూర్చోవడానికి కుర్చీలు అందజేశారు. అష్టమ్ పేరు మీద ఆమె ఇంటివరకూ అధికారులు రహదారిని నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే... ఆ ఊర్లో వేసే రోడ్డు కోసం జరిగే నిర్మాణ పనుల్లో ఆమె తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తూ మట్టిని తవ్వి ఎత్తిపోస్తున్నారు. దీనిపై వారిని కదిలించగా... పూట గడవాలంటే తాము పని చేయక తప్పదుగా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.