
బ్యాంకాక్: ఇండియా బాక్సర్లు భావనా శర్మ, యాత్రి పటేల్.. అండర్–22 ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు ఖాయం చేసుకున్నారు. ఆదివారం జరిగిన విమెన్స్ 48 కేజీ క్వార్టర్ఫైనల్లో భావనా.. ఎంగోక్ లిన్హ్ చి ఎంగో (వియత్నాం)పై గెలవగా, 57 కేజీ బౌట్లో యాత్రి.. కీర్తన ఉత్తయకుమార్ (శ్రీలంక)ను చిత్తు చేసింది. ఈ ఇద్దరు ఏకపక్ష విజయాలు సాధించి సెమీస్‌లోకి ప్రవేశించారు.
విమెన్స్ 54 కేజీ క్వార్టర్స్‌లో టాను.. నట్నిచా చోంగ్ప్రోంగ్క్లాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. ఇక అండర్–19 విభాగంలో శివమ్, మౌసమ్ సుహాగ్ ముందంజ వేశారు. మెన్స్ 55 కేజీల విభాగంలో శివమ్.. బెజిర్గెన్ అన్నయేవ్ (తుర్క్మెనిస్తాన్)పై నెగ్గాడు. బౌట్ ఆరంభం నుంచే హుక్స్, అప్పర్ కట్స్‌తో చెలరేగిన శివమ్ మూడు రౌండ్లలో స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపెట్టాడు. 65 కేజీ కేటగిరీలో సుహాగ్ 3–2తో నూర్కాబైలులీ ముఖిత్ (కజకిస్తాన్)ను ఓడించాడు. అయితే 60 కేజీల విభాగంలో శుభమ్ 0–5తో టోర్టబెక్ అడిలెట్ (కజకిస్తాన్) చేతిలో ఓడాడు.