ఖషోగీ హత్యతో సౌదీ ప్రిన్స్​కు లింక్

ఖషోగీ హత్యతో సౌదీ ప్రిన్స్​కు లింక్
  • విశ్వసనీయ ఆధారాలు దొరికాయ్‌
  • యూఎన్ రైట్స్ ఎక్స్ పర్ట్ వెల్లడి

జెనీవా: జర్నలిస్టు జమాల్​ఖషోగి హత్య విషయంలో సౌదీ యువరాజు పాత్ర ఉందనేందుకు ఆధారాలు దొరికాయని యూఎన్ ​మానవ హక్కుల కార్యకర్త ఒకరు వెల్లడించారు. ఈ కేసులో ​సమగ్ర విచారణ జరిపించాలని యూఎన్ సెక్రటరీ జనరల్​ను ఆమె డిమాండ్​చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల ఎక్స్‌పర్ట్‌  ఆగ్నస్‌ కాలమార్డ్‌ యూఎన్ కు సేవలందిస్తుంటారు. ఖషోగీ హత్య విషయంలో సౌదీ ప్రిన్స్​మహ్మద్ బిన్​సల్మాన్ పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆమె పరిశోధన జరిపారు. తాను సేకరించిన వివరాలతో ఆమె ఓ రిపోర్టును విడుదల చేశారు.

దీనిపై ఆగ్నస్‌ మాట్లాడుతూ.. ఖషోగీ హత్యలో దోషులు ఎవరన్నదీ ఇదమిద్దంగా చెప్పలేం.. కానీ తాజాగా దొరికిన ఆధారాలతో గట్టిగా విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు. హత్య చేసింది ఎవరు.. ఎవరి ఆదేశాలతో చేశారనే విషయం బయటపడుతుంది. సౌదీ రాజు సల్మాన్​శక్తిసామర్థ్యాలు ఏపాటివో ఖషోగీకి తెలుసు. అందుకే ఆయన కొంత భయపడ్డారు కూడా.. చివరకు ఆయన భయపడ్డట్లే జరిగిందన్నారు. ఈ కేసు విషయంలో సౌదీ, టర్కీ ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపలేదన్నారు. హత్యా స్థలంలో నామమాత్రంగా పరిశోధన చేయడంతో నింధితులు జాగ్రత్తపడి ఆధారాలను మాయంచేశారని ఆగ్నస్ తన రిపోర్టులో పేర్కొన్నారు.

వాషింగ్టన్​ పోస్ట్​ జర్నలిస్ట్ ​జమాల్​ ఖషోగి గత ఏడాది అక్టోబర్ ​2న ఇస్తాంబుల్​లోని సౌదీ కాన్సులేట్​లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయంతో తమకేమీ సంబంధంలేదని రియాద్​అప్పట్లో ఓ ప్రకటన విడుదల చేసింది. తర్వాత కాన్సులేట్​లో ఏజెంట్లు చంపేశారని వాదించింది. సౌదీ ప్రిన్స్‌ ఆదేశాలతో ఆ దేశ అధికారులే ఖషోగీని తుదముట్టించారని  సీఐఏ కూడా ఆరోపించింది. అయితే ఖషోగీ హత్య మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు.

………………