
ఆసియా కప్ లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ లో విజృంభించింది. బుధవారం (సెప్టెంబర్ 10) పసికూన యూఏఈపై మన బౌలర్లు విశ్వరూపమే చూపించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు తోడు మిగిలిన బౌలర్లు రాణించడంతో 13.1 ఓవర్లలో యూఏఈ కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. 22 పరుగులు చేసిన ఓపెనర్ అలీషన్ షరాఫు టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. శివమ్ దూబేకు మూడు వికెట్లు దక్కాయి. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన యూఏఈ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. హార్దిక్ పాండ్య వేసిన తొలి ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి. తొలి మూడు ఓవర్లలో 25 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. అయితే ఇక్కడ నుంచి యూఏఈ పతనం మొదలైంది. అలీషన్ షరాఫును బుమ్రా బౌల్డ్ చేసి శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్ లోనే వికెట్ తీయడంతో యూఏఈ రెండో వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి యూఏఈ 41 పరుగులు చేసింది.
10 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు:
పవర్ ప్లే తర్వాత టీమిండియా స్పిన్నర్ల ధాటికి ఆతిధ్య జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. 9 ఓవర్లో కుల్దీప్ యాదవ్ ఏకంగా మూడు వికెట్లు తీయడంతో యూఏఈ పీకల్లోతు కష్టాల్లో పడింది. 50 పరుగులకే సగం జట్టుకు కోల్పోయింది. ఆ ఆతర్వాత ఆల్ రౌండర్ శివమ్ దూబే తన సూపర్ బౌలింగ్ తో మెరిశాడు. మూడు వికెట్లు తీసి యూఏఈని కోలుకోనీయకుండా చేశాడు. చివరి వికెట్ కు కుల్దీప్ యాదవ్
తీసుకోవడంతో యూఏఈ కేవలం 57పరుగులకే ఆలౌట్ అయింది. యూఏఈ బ్యాటింగ్ లైనప్ లో ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.
►ALSO READ | Asia Cup 2025: మిడిల్ ఆర్డర్‌లో శాంసన్.. అర్షదీప్‌ను తప్పించడానికి కారణం ఇదే!