శివాజీ విగ్రహం కూలడం మహారాష్ట్ర ఆత్మకే అవమానం: ఉద్ధవ్ థాక్రే

శివాజీ విగ్రహం కూలడం మహారాష్ట్ర ఆత్మకే అవమానం: ఉద్ధవ్ థాక్రే

ముంబై: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన క్షమాపణల్లోనూ అహంకారమే ప్రతిధ్వనించిందని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే ఫైర్ అయ్యారు. ‘‘ప్రధాని మోదీ ఎందుకు క్షమాపణలు చెప్పారు..? శివాజీ విగ్రహం కూలినందుకా..? లేదంటే ఆ విగ్రహ నిర్మాణంలో అవినీతి జరిగినందుకా?” అని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ఆదివారం ఉదయం ముంబైలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నేతలు ‘జోడే మారో(చెప్పులతో కొట్టండి)’ పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

 నగరంలోని హుతాత్మ చౌక్ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా వరకూ సాగిన ర్యాలీలో ఉద్ధవ్ థాక్రేతోపాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ స్టేట్ చీఫ్ నానా పటోలే, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్తుండగా వేదికపై ఉన్న డిప్యూటీ సీఎం నవ్వుతూ కనిపించారని, మోదీ క్షమాపణల్లో అహంకారమే కనిపించిందన్నారు. ప్రధాని క్షమాపణలను ప్రజలు తిరస్కరించారన్నారు. 

శివాజీ మహరాజ్ విగ్రహం కూలడం మహారాష్ట్ర ఆత్మకే అవమానం అని, ఆయనను అవమానించిన శక్తులను ఓడించేందుకు ఎంవీఏ క్యాడర్ అంతా ఒక్కతాటిపైకి రావాలని ఉద్ధవ్ పిలుపునిచ్చారు. కాగా, సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్​కోట్ కోట వద్ద ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ 8 నెలల క్రితం ప్రారంభించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ విగ్రహం పోయిన నెల 26న కూలి ముక్కలైంది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని మోదీ శుక్రవారం ముంబై పర్యటనలో క్షమాపణలు చెప్పారు.

అవినీతికి నిదర్శనం: పవార్ 

ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన షిండే సర్కారు అవినీతికి నిదర్శనమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇది శివాజీ ఫాలోవర్లకు అవమానమని అన్నారు. ఇలాంటి శివద్రోహి ప్రభుత్వాన్ని అధికారంలోకి రానిచ్చినందుకు తమను క్షమించాలని శివాజీని కోరుకుంటున్నారని నానా పటోలే అన్నారు. 

క్షమాపణ చెప్పాక కూడా రాజకీయమా: షిండే  

ఒకవైపు ఔరంగజేబు, అఫ్జల్ ఖాన్‎ల విధానాలను అనుసరిస్తున్న శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే మరోవైపు శివాజీ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఫైర్ అయ్యారు. ఆదివారం ముంబైలో మీడియాతో ఆయన మాట్లాడారు. విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీతోపాటు తామంతా క్షమాపణలు చెప్పాక కూడా.. ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారు. ‘‘ఇది మన గుర్తింపు, విశ్వాసానికి సంబంధించిన విషయం. విగ్రహం కూలడం దురదృష్టకరం. ప్రతిపక్షాలు దీనిపై రాజకీయాలు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రజలు తెలివైనవారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లనే చెప్పులతో కొడతారు” అని షిండే అన్నారు.  కాగా, శివాజీ విగ్రహంపై ప్రతిపక్షాలు రాజకీయంచేయడం దారుణమని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కూడా మండిపడ్డారు.