శ్రీశైలం, వెలుగు: శ్రీశైలంలో ఈ నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి శనివారం ఆలయ పరిపాలన భవనంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆలయ ఈవో లవన్న మాట్లాడారు. ఉత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఉగాది మహోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆలయానికి వారం రోజుల ముందు నుంచే కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, వారి కోసం వసతి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే, పాదయాత్ర మార్గంలో వచ్చే భక్తుల కోసం కూడా భీమునికొలను, కైలాస ద్వారం, అటవీ మార్గంలో నీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిధిలో సమాచార కేంద్రాలు, సూచిక బోర్డులు పెట్టాలన్నారు. ఉగాది ఉత్సవాల ఏర్పాట్లన్ని ఈ నెల 12లోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
