12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు

12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు

ఒక్క పెళ్లి చేసుకుని ఒకరిద్దరు పిల్లల్ని పెంచేందుకే చాలా మంది తిప్పలు పడుతున్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకుని 102 మంది పిల్లల్ని కన్నాడు. అయితే అంతమందిని పోషించడం తలకు మించిన భారంగా మారడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.

ఉగాండాలోని బుగిసాకు చెందిన ముసా హసస్యాకు వంశాన్ని వృద్ధి జరగాలంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనాలని పెద్దవాళ్లు చెప్పారట. వారి మాటకు కట్టుబడి 12  మందిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు వాళ్లను పోషించలేక తిప్పలు పడుతున్నాడు. ఇంత మంది పిల్లలున్న ముసా హసస్యాకు కేవలం రెండెకరాల భూమి ఉంది. అందులో పండే పంటే వారి జీవనాధారం. పెళ్లాం పిల్లలకు తిండి, దుస్తులు తదితర కనీస అవసరాలు సమాకూర్చ లేకపోతుండటంతో ఇటీవలే ఇద్దరు భార్యలు అతడిని విడిచి వెళ్లిపోయారు. మరో ముగ్గురు భార్యలు పక్క ఊర్లో విడిగా బతుకుతున్నారు. 

1972లో ముసా హసస్యా 17 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన ఏడాదికే మొదటి బిడ్డ సాండ్రా నాబ్వైర్‌ పుట్టింది. ఆ తర్వాత వరుసగా పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల్ని కనడం రివాజుగా మారిపోయింది. ఆయన పిల్లల వయసు పదేళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండగా.. ప్రస్తుతం అతని చిన్న భార్య వయసు 35 ఏళ్లు కావడం విశేషం. హసస్యాకు తన పిల్లల్లో చాలా మంది పేర్లు కూడా గుర్తులేకపోవడం కొసమెరుపు.