రేపే బ్రిటన్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం

రేపే బ్రిటన్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం
  • లిజ్ ట్రస్​కే సర్వేలు అనుకూలం 
  • రేపే కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం 

లండన్: బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రి ఎవరో సోమవారం తేలిపోనుంది. యూకే చరిత్రలోనే తొలిసారిగా ఒక ఇండియన్ ఆరిజిన్ లీడర్ కు పదవి దక్కుతుందా? లేదంటే బ్రిటన్ కు మూడోసారి మహిళా ప్రధాని వస్తారా? అన్నది సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకల్లా వెల్లడికానుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో బ్రిటన్ లో ఇంధన ధరలు, జీవన వ్యయం విపరీతంగా పెరగడం, కరోనా సమయంలో రూల్స్ కు విరుద్ధంగా పార్టీలు, ఇతర వివాదాల కారణంగా యూకే ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ గతంలోనే రాజీనామా ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో కొత్త ప్రధాని, అధికార కన్జర్వేటివ్ పార్టీ కొత్త లీడర్ ఎన్నిక కోసం పార్టీలో జరిగిన ఓటింగ్ శుక్రవారం ముగిసింది. 
 
రేపు తప్పుకోనున్న బోరిస్ జాన్సన్  
ఫలితాలను ప్రకటించినంక కన్జర్వేటివ్ పార్టీ కొత్త లీడర్​గా గెలిచిన నేత సోమవారం లండన్ లోని ఎలిజబెత్ కాన్ఫరెన్స్ సెంటర్​లో యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇస్తారు. ఆ తర్వాత కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తారు. మంగళవారం ఫేర్ వెల్ స్పీచ్ ఇచ్చినంక పదవి నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకుంటారు. ఆ వెంటనే క్వీన్ ఎలిజబెత్ 2 సమక్షంలో కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తారు.  

లిజ్ ట్రస్ దే విజయం? 
కొత్త ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి శునక్ (42), ప్రస్తుత విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ (47) పోటాపోటీగా ప్రచారం చేశారు. అయితే, మొదటి నుంచీ గట్టి పోటీని ఇచ్చినప్పటికీ రిషి ఓటమి తప్పదని సర్వేలు చెప్తున్నాయి. ఈ ఎన్నికపై జరిగిన అన్ని సర్వేల్లోనూ లిజ్ ట్రస్ కే విజయం దక్కుతుందని అంచనా వేశాయి.