లవర్ కోసం లండన్ నుంచి వస్తే.. మరో వ్యక్తితో పెళ్లి.. నిజామాబాద్ జిల్లాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

లవర్ కోసం లండన్ నుంచి వస్తే.. మరో వ్యక్తితో పెళ్లి.. నిజామాబాద్ జిల్లాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఆరేళ్ల ప్రేమ వాళ్లది. పెళ్లి చేసుకుందామని ఒట్టు పెట్టుకున్నారు. పెళ్లికి ముందు బాగా సెటిల్ అవ్వాలని.. అప్పుడే పెద్దలు ఒప్పుకుంటారని భావించారు. లండన్ లో జాబ్ రావడంతో బాగా సంపాదించుకుని వస్తానని.. తన ప్రేయసిని వీడలేక వీడుతూ.. ఆమె పలికిన వీడ్కోలును తన కళ్లల్లోనే దాచుకుని దేశం కాని దేశానికి వెళ్లాడు. ఆర్థికంగా ఇక అంతా ఓకే.. ఊరెళ్లి పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అని లండన్ నుంచి సొంతూరుకు వచ్చి చూసే సరికి ఊహించని షాక్ కు గురయ్యాడు ఆ ప్రేమికుడు. అది తట్టుకోలేక వెంటనే సూసైడ్ చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోమచంద గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ తన లవర్ కోసం లండన్ నుంచి వచ్చి.. ఆమెకు మరో పెళ్లి అయ్యిందని తెలిసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్ రెడ్డి, ఏరుగట్ల గ్రామానికి చెందిన యువతి ఇద్దరు గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకుందామని వచ్చిన శ్రీకాంత్ రెడ్డి.. తన లవర్ కి మరో వ్యక్తితో పెళ్లి చేసుకుందని తెలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. శ్రీకాంత్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడంతో కుటుంబు సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స చేస్తుండగానే చనిపోయాడు. 

ALSO READ : సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం

లక్షల్లో సంపాదిస్తున్న తమ కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కొడుకు మృతికి కారణం ఆ కుటుంబ సభ్యులేనంటూ శుక్రవారం (నవంబర్ 28) మృతదేహంతో ఆందోళనకు దిగారు. ప్రేమ పేరుతో మోస పోయిన తమ కుమారుడికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ.. మృతదేహాన్ని పోలీస్ వాహనంపై పెట్టి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, బాధిత కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

తమ కుమారుడిని మెంటల్ గా బ్లాక్ మెయిల్ చేశారని, ప్రేమ పేరుతో మోసం చేసి మృతికి కారణం అయ్యారని ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల డిమాండ్ తో కేసు నమోదు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు.. విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాంత్ సూసైడ్ కు గల కారణాలపై విచారణ జరిపి.. చర్యలు తీసుకుంటామని చెప్పారు.