మస్కట్: హార్మూజ్ జలసంధి దాటి ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై మంగళవారం వేకువజామున క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో నౌకలోని ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతినడంతో సిబ్బందిలో ఒకరు మరణించారని బ్రిటన్ రక్షణ దళాలకు చెందిన యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎమ్‌టీవో) తెలిపింది. నౌక వివరాలు, అందులోని సరుకుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ఒమన్ తీరానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడిలో ఎలాంటి ఇంధన లీకేజీ లేదా పర్యావరణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ అటాక్‌కు ఏ సంస్థ లేదా దేశం బాధ్యత వహించలేదు.
హార్మూజ్ తెరుచుకోదు: మహమ్మద్ ఖాలిబాఫ్
అమెరికా తమ షరతులను నెరవేర్చే వరకు హార్మూజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈమేరకు మంగళవారం ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఖాలిబాఫ్ మాట్లాడుతూ...‘‘అమెరికా తన బ్లాకేడ్‌ను ఉపసంహరించుకోవడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, చమురుపై ఆంక్షలను ఎత్తివేయడం, సైనిక చర్యల నిలిపివేత వంటి ఒప్పంద షరతులను అమలుచేసే వరకు హార్మూజ్ జలసంధి మూసే ఉంటుంది” అని పేర్కొన్నారు.
