కీవ్​పై మళ్లీ విరుచుకుపడ్డ రష్యా

కీవ్​పై మళ్లీ విరుచుకుపడ్డ రష్యా
  • రెండు నివాస సముదాయాలపై మిస్సైల్స్​ దాడి

కీవ్: ఉక్రెయిన్​ రాజధాని కీవ్​పై రష్యా సేనలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఆదివారం ఉదయం క్షిపణులతో రెండు నివాస సముదాయాలను నేలమట్టం చేశాయి. ఈ విషయాన్ని కీవ్​ మేయర్​ విటాలి క్లిచ్​స్కో వెల్లడించారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని ఉక్రెయిన్​ బలగాలు కాపాడాయి.  నలుగురు స్థానికులు తీవ్రంగా గాయపడగా అధికారులు వారిని హాస్పిటల్​కు తరలించారు. గాయపడ్డవారిలో ఏడేండ్ల చిన్నారి కూడా ఉంది. ఆదివారం ఉదయం రష్యా14 మిస్సైల్స్​ను ప్రయోగించిందని ఉక్రెయిన్​ ఎంపీ ఒలెక్సియ్​ తెలిపారు.

మరోవైపు ఉక్రెయిన్​పై యుద్ధాన్ని మరింత కాలం కొనసాగించేందుకు రష్యా తన క్షిపణులను బెలారస్​కు భారీగా తరలించే ఏర్పాట్లు చేస్తున్నది. రష్యాకు దీటుగా ఉక్రెయిన్​ సేనలు కూడా ముందుకు కదులుతున్నాయి. రష్యా తీరును అమెరికా ప్రెసిడెంట్​ బైడెన్​ ఖండించారు. జర్మనీలో జరుగుతున్న జీ 7 సమ్మిట్​లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. రష్యా చర్య అనాగరికం అని మండిపడ్డారు.