ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య ముదురుతున్న యుద్ధం

ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య ముదురుతున్న యుద్ధం
  • మరింత దూకుడుగా ఉక్రెయిన్‌‌‌‌పై ఉరుముతున్న రష్యా
  • వందల ట్యాంకులు, ఫిరంగులతో కీవ్‌‌‌‌ వైపు భారీ కాన్వాయ్
  • ప్రభుత్వ, మిలటరీ బిల్డింగులను మార్క్ చేసి మిసైల్ దాడులు
  • తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైన్యం
  • ఎక్కడికక్కడ రష్యన్ సైనికుల అడ్డగింత
  • ఇయ్యాల రెండు దేశాల మధ్య మరోసారి చర్చలు

రష్యా దండయాత్రను ఉక్రెయిన్ అడుగడుగునా అడ్డుకుంటోంది. తన శక్తికి మించి పోరాడుతోంది. దేశానికి గుండె లాంటి కీవ్ సిటీపై మిసైళ్ల వర్షం కురుస్తున్నా.. బాంబుల మోత మోగుతున్నా వెన్నుచూపడం లేదు. దెబ్బకు దెబ్బతీస్తోంది. ప్రత్యర్థి నుంచి అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రతిఘటన ఎదురుకావడంతో రష్యా దెబ్బతిన్న పులిలా గర్జిస్తోంది. వందల యుద్ధ ట్యాంకులు, ఫిరంగులతో కీవ్‌ వైపు దూసుకొస్తోంది. ఇప్పటికే పలు నగరాలను చుట్టుముట్టి దాడులను పెంచుతోంది. తమ లక్ష్యాలను చేరుకునే దాకా దాడులను ఆపబోమని రష్యా చెబుతుండగా.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కీవ్‌ను రక్షించుకుంటామని ఉక్రెయిన్ తెగేసి స్పష్టం చేస్తున్నది. ఈ ఉద్రిక్తతల నడుమనే.. ఇయ్యాల రెండు దేశాల మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి.
కీవ్/న్యూఢిల్లీ: ఒకవైపు ఆంక్షలతో విరుచుకుపడుతున్న అగ్రదేశాలు! మరోవైపు ముప్పేట చుట్టుముట్టి దాడులతో భయపెడుతున్నా తలొగ్గని ప్రత్యర్థి! వెరసి రష్యా.. మరింత దూకుడుగా ఉక్రెయిన్‌‌‌‌పై ఉరుముతోంది. కీలకమైన రాజధాని కీవ్, రెండో పెద్ద సిటీ ఖార్కివ్‌‌‌‌లను చేజిక్కించుకునేందుకు భారీగా సైన్యాన్ని నడిపిస్తోంది. రోడ్డుపై ఒకటీ రెండు కాదు.. ఏకంగా 64 కిలోమీటర్ల మేర రష్యా మిలటరీ కాన్వాయ్‌‌‌‌ వరుస కట్టి.. ఉక్రెయిన్ రాజధాని వైపు దూసుకుపోతున్నది. దారిలో కనిపించిన ఇండ్లను కాలబెడుతున్నది. ప్రభుత్వ, మిలటరీ బిల్డింగులను టార్గెట్ చేసుకున్నది. ముందుగా మార్క్ చేసుకుని, టార్గెట్ ఫిక్స్ చేసుకుని, మిసైళ్ల వర్షం కురిపిస్తున్నది. మంగళవారం ఖార్కివ్‌‌‌‌లో జరిగిన మిసైల్ దాడిలో ఇండియన్ స్టూడెంట్‌‌‌‌ చనిపోయాడు. ఇప్పటిదాకా 14 మంది చిన్నారులు సహా 352 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ చెప్పింది. వేలాది మంది పౌరులు కీవ్, ఇతర సిటీల్లో మెట్రోస్టేషన్లు, షెల్టర్లు, బేస్‌‌‌‌మెంట్లు, కారిడార్లలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. బుధవారం బెలారస్‌‌‌‌లో రెండు దేశాల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.
చుట్టుముట్టి.. నిర్బంధించి..!
గత గురువారం నాడు రష్యా యుద్ధం మొదలుపెట్టగా.. ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్‌‌‌‌ దిశగా వస్తున్న రష్యన్ సైనికులను ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. మొన్నటి నుంచి రష్యాకు వరుసగా ఓటములు ఎదురుకావడంతో.. నెత్తుటి విజయం సాధించేందుకు మధ్య యుగం నాటి వ్యూహాలను పుతిన్ ఉపయోగిస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపించింది. సిరియాలో చేసినట్లుగా.. ఇక్కడ కీవ్ నగరాన్ని చుట్టుముట్టి, బాంబు దాడులు చేయాలని భావిస్తున్నదని చెప్పింది. ‘‘ప్రధాన నగరాలకు జరిగే సరఫరాలను ఆపేసి, ఆహార సంక్షోభం సృష్టించేందుకు రష్యన్ దళాలు ప్రయత్నించవచ్చు. ఇప్పటికే కీవ్‌‌‌‌లోని సూపర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఆహారం అందుబాటులో ఉండేలా చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం రంగంలోకి దిగాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్‌‌‌‌లో ఉక్రెయిన్ అంబాసిడర్ వాదిమ్ ప్రిస్టయ్‌‌‌‌కో చెప్పారు. ముట్టడి వ్యూహాలను రష్యా ఇప్పటికే మరియుపోల్‌‌‌‌లో అమలు చేస్తోంది. స్కూళ్లు, ఇండ్లతోపాటు పౌరులు ఉన్న అన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఫిరంగుల ద్వారా నిరంతరం షెల్లింగ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే పిల్లలు సహా ఎంతో మంది చనిపోయారు. ఈ సిటీకి ఇప్పటికే పవర్ కట్ చేశారు. మరియుపోల్‌‌‌‌ ప్రస్తుతం ఉక్రెయిన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌లోనే ఉంది. ఖెర్సన్ సిటీలోనూ ఇలానే రష్యా దాడులు చేస్తున్నది. శివార్లలో ప్రజలు ఉన్న బిల్డింగులపై మిసైల్ దాడులు జరుగుతున్నాయి. వీధుల గుండా దళాలు లోనికి చొచ్చుకెళ్తున్నాయి.
రూటు మార్చిందా?!
యుద్ధం మొదలయ్యాక మిలటరీ బేస్‌‌‌‌లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌ స్ట్రిప్‌‌‌‌, బారక్‌‌‌‌లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసింది. తొలి మూడు నాలుగు రోజులు ఇలానే నడిచింది. కీవ్‌‌‌‌లోకి చిన్న గ్రూపులను పంపింది. కానీ ఉక్రెయిన్ ఎంతకీ లొంగకపోవడంతో ఇప్పుడు దాడులను విస్తరించింది. సిటీల్లో ఇండ్లపై బాంబులు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది. పెద్ద సంఖ్యలో దళాలను కీవ్, ఖార్కివ్ దిశగా నడిపిస్తోంది. చాలా ఏరియాల్లో ప్రజల ఇండ్ల మధ్య ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఇండ్లను కూడా బాంబులు తాకుతున్నాయి. సైనికులు భారీగా రోడ్డు మార్గంలో వెళ్తుండటంతో.. ఇకపై గగనతలం నుంచి జరిగే దాడులు తగ్గిపోయే అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి కీవ్‌‌‌‌ ను చుట్టుముట్టి స్వాధీనం చేసుకునేందుకు సైన్యం ప్రయత్నిస్తోంది.
బెలారస్ కూడా యుద్ధంలోకి!
తమపై బెలారస్ దళాలు కూడా దాడి చేస్తున్నయని ఉక్రెయిన్ చెప్పింది. చెర్నిహివ్‌‌‌‌ వైపు ఆ దేశం సోల్జర్లు కదులుతున్నారని తెలిపింది. ‘మంగళవారం ఉదయం బెలరాస్ దళాలు చెర్నిహివ్‌‌‌‌ సిటీలోకి ఎంటర్ అయ్యాయి. తన మనుషులు యుద్ధంలోకి దిగారన్న విషయాన్ని బెలారస్ నియంత అలెగ్జాండర్ లుకాషెంకో అంగీకరించలేదు’ అని ఉక్రెయిన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
సైనికుడా.. ఇంటికి వెళ్లు!
కీవ్‌‌‌‌లోకి ఎంటర్ అవుతున్న రష్యన్లకు ఉక్రేనియన్లు బిల్ బోర్డులు, బస్ స్టాప్, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మెసేజ్‌‌‌‌లు పెడుతున్నారు. కొందరు రష్యా సైనికులను బూతులు తిడుతుంటే.. మరికొందరు వేడుకుంటున్నారు. ‘‘రష్యా సైనికుడా.. ఆగు! నీ కుటుంబాన్ని గుర్తుచేసుకో. స్వచ్ఛమైన మనస్సాక్షితో ఇంటికి వెళ్లు’’ అని ఒకచోట ప్రదర్శించారు.
కీవ్‌‌‌‌కు ఉత్తరాన.. 64 కిలోమీటర్ల పొడవునా..
కీవ్ సిటీకి ఉత్తరాన రష్యన్ ఆర్మీ భారీగా వరుస కట్టింది. దాదాపు 64 కిలోమీటర్ల పొడవునా సాయుధ కాన్వాయ్ ముందుకు కదులుతోంది. ఇవాంకివ్ సిటీకి ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో దారిలో కనిపించిన ఇండ్లను కాల్చుకుంటూ పోతున్నది. ఇందుకు సంబంధించిన శాటిలైట్​ ఇమేజ్‌‌‌‌లు బయటికి వచ్చాయి. కాన్వాయ్‌‌‌‌లో వందలాది ట్యాంకులు, ఫిరంగులు వస్తున్నాయి. ఆంటోనోవ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు నుంచి ప్రైబిర్స్క్ పట్టణం దాకా రోడ్డుపై ఈ కాన్వాయ్‌‌‌‌ విస్తరించి ఉంది. అంతకుముందు రోడ్డుపై దాదాపు 27 కిలోమీటర్ల మేర కాన్వాయ్ విస్తరించి ఉండగా.. సోమవారం నాటికి 64 కిలోమీటర్లకు పెరిగింది.
మిలటరీ బేస్‌‌‌‌పై దాడి.. 70 మంది మృతి
కీవ్, ఖార్కివ్‌‌‌‌కు మధ్య ఉన్న ఓఖ్‌‌‌‌టిర్కా సిటీ మిలటరీ బేస్‌‌‌‌పై రష్యా దాడి చేసిందని.. ఈ ఘటనలో 70 మందికి పైగా సోల్జర్లు చనిపోయారని ఈ రీజియన్ హెడ్ దిమిత్రో ఝివిట్స్‌‌‌‌కీ చెప్పారు. ఈ దాడిలో మిలటరీ యూనిట్ మొత్తం ధ్వంసమైందని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని, డెడ్ బాడీలను వెలికి తీస్తున్నామని తెలిపారు. అంతకుముందు సుమీలో ఆయిల్ డిపోను రష్యన్లు పేల్చేశారు.
ఇయ్యాల మరోసారి చర్చలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య బుధవారం రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఈ విషయాన్ని రష్యా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సోమవారం జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో మరోసారి సమావేశం కావాలని రెండు దేశాలు నిర్ణయించాయి. తొలి విడత చర్చలు బెలారస్‌‌లోని గోమెల్‌‌లో దాదాపు 5 గంటలపాటు జరిగాయి.  ‘‘రెండు దేశాల ప్రతినిధులు కొన్ని విషయాలపై అంగీకారానికి వచ్చారు. ఇప్పుడు ఇంకో రౌండ్ చర్చల కోసం వచ్చే ముందు తమ ప్రభుత్వ పెద్దలను సంప్రదిస్తారు’’ అని రష్యా టుడే మంగళవారం పేర్కొంది.