అయ్యో ఉక్రెయిన్.. ఎంత కష్టమొచ్చింది..!

అయ్యో ఉక్రెయిన్.. ఎంత కష్టమొచ్చింది..!
  • రష్యా  దాడులతో ఉక్రెయిన్ లో భయానక దృశ్యాలు
  • గుట్టగుట్టలుగా మృతదేహాలు.. భయంతో వణుకుతున్న ప్రజలు
  • బాంబ్ షెల్టర్లు, మెట్రో స్టేషన్లే నివాసాలు.. ఆదుకోవాలంటూ వేడుకోలు

రష్యా దాడితో ఉక్రెయిన్ లో ఎటూ చూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ విన్నా బాంబుల మోతే వినిపిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ముసలివాళ్ల వరకు..ప్రతి ఒక్కరికీ క్షణమొక యుగంలా గడుస్తోంది. ఎప్పుడు ఏం జరుగతుందనే ఆందోళన, భయం ఉక్రెయిన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాపాడుతాయనుకున్న అమెరికా, యూఎన్వో, నాటో దేశాలు చేతులెత్తేశాయి. ఏదో మొక్కుబడిగా అక్కడక్కడా రష్యాకు నిరసనగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా.. ఉక్రెయిన్ కు అండగా రష్యాకు ఎదురు నిలిచి పోరాడేందుకు ఏ ఒక్క దేశం ధైర్యం చేసి ముందుకు రావడంలేదు. 

రష్యా దాడులతో  మొదటి రోజు భయం భయంగా గడిపిన ఉక్రెయిన్ ప్రజలు... రెండో రోజు కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. బాంబ్ షెల్టర్లు, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తల దాచుకుంటున్నారు. నిద్రాహారాలు లేవు. ఎవరో వచ్చి కాపాడుతారన్న ఆశ కూడా ఉక్రెయిన్ వాసుల్లో చచ్చిపోతోంది. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. రష్యా యుద్ధ కాంక్ష ఎప్పటికి చల్లారుతుందో తెలియదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆకలితోనే చాలా మంది చనిపోయే ప్రమాదం కనిపిస్తోంది. 

రష్యా మాత్రం వెనక్కు తగ్గడంలేదు. రోజురోజుకు దాడి తీవ్రతను పెంచుకుంటూ దాడులకు పాల్పడుతోంది. అడ్డంగా ఉన్న కార్లను తొక్కుకుంటూ రష్యా బంకర్లు దూసుకొస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గుట్టలు గుట్టలుగా మృతదేహాలతో ఉక్రెయిన్ ఇప్పుడు ఓ స్మశానంలా కనిపిస్తోంది. రష్యా సైనిక బలంతో పోలిస్తే తమ సైనిక బలం తక్కువని వారికి తెలుసు. అంతా తక్కువ మందితో  ప్రత్యర్థి బలం ముందు నిలువలేరని తెలుసు. అయినా మాతృదేశాన్ని దురాక్రమణ నుంచి కాపాడుకోవాలన్న ఒకే ఒక్క సంకల్పం ఉక్రెయిన్ సైనికులను ముందుకు నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే  విజయమో.. వీరమరణమో అంటూ చాలా మంది ఉక్రెయిన్ యువకులు తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఉక్రెయిన్ సైన్యంలో భాగస్వాములవుతున్నారు.  ఈ క్రమంలో సైనికులను యుద్ధభూమికి పంపుతూ.. కుటుంబ సభ్యులు వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. 

ఇప్పటికైనా రష్యా తమ దేశంపై దాడులను ఆపాలని ఉక్రెయిన్ ప్రజలు కోరుతున్నారు. రష్యా నుంచి తమని కాపాడాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచ దేశాలను వేడుకుంటున్నాడు. పరస్పర సహకారం లేకుంటే రానున్న రోజుల్లో ఇప్పుడు ఉక్రెయిన్ కి వచ్చిన పరిస్థితే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.