వాక్యూమ్, క్లస్టర్ బాంబులతో రష్యా దాడి 

వాక్యూమ్, క్లస్టర్ బాంబులతో రష్యా దాడి 

వాషింగ్టన్: రష్యా తమపై క్లస్టర్ బాంబులు, వాక్యూమ్ బాంబులతో దాడి చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. ‘‘రష్యా ఈరోజు వాక్యూమ్ బాంబు వేసింది. ఉక్రెయిన్ లో అది సృష్టించాలనుకుంటున్న విధ్వంసం చాలా పెద్దది” అని సోమవారం అమెరికాలోని ఉక్రెయిన్ అంబాసిడర్ ఒక్సానా మార్కరోవా ఆరోపించారు. రష్యా తీరును ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ సహా వివిధ అంతర్జాతీయ సంస్థలు ఖండించాయి. నిషేధించిన ఆయుధాలను యుద్ధంలో వాడుతోందని మండిపడ్డాయి. ఈశాన్య ఉక్రెయిన్ లోని స్కూల్ లో తలదాచుకున్న ప్రజలపై దాడి చేసిందని పేర్కొన్నాయి. రష్యా వాక్యూమ్ బాంబులను వాడినట్లయితే, అది యుద్ధ నేరమవుతుందని అమెరికా ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ అన్నారు. అయితే రష్యా వాక్యూమ్ బాంబులను వేసినట్లు కన్ఫమ్​ కాలేదు. 

ఏంటీ వాక్యూమ్ బాంబు?

వాక్యూబ్ బాంబును థర్మోబారిక్ వెపన్, ఏరోసోల్ బాంబు అని కూడా పిలుస్తారు. మిగతా బాంబులతో పోలిస్తే ఇది సృష్టించే బీభత్సం చాలా ఎక్కువ. ఈ బాంబును ప్రయోగించినప్పుడు, అది చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆక్సిజన్ ను పీల్చుకుంటుంది. తర్వాత భారీగా టెంపరేచర్​ను విడుదల చేస్తూ పేలిపోతుంది. ఇది మానవ శరీరాన్ని ఆవిరి చేయగలిగేంత టెంపరేచర్​ను 
సృష్టిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు.