
మాస్కో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న వేళ ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రతరం చేసింది రష్యా. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై గురువారం (ఆగస్ట్ 28) మరోసారి ఎటాక్ చేసింది. ఒడెసా ప్రాంతానికి సమీపంలోని డానుబే నది డెల్టాలో ఉక్రెయిన్ నావికాదళ నిఘా నౌక సింఫెరోపోల్‌పై రష్యన్ నేవీ డ్రోన్ దాడి చేసింది.
రష్యా డ్రోన్ దాడిలో నడి సముద్రంలో ఉక్రెయిన్ యుద్ధ నౌక ధ్వంసమైంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ యుద్ధ నౌకపై రష్యా డ్రోన్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ మాత్రం చాలా సార్లు రష్యా నేవీ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. రష్యా తాజా దాడితో ఉక్రెయిన్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
రష్యా డ్రోన్ ఎటాక్‌లో ఒక నేవీ అధికారి మృతి చెందగా.. మరికొందరు కనిపించకుండా పోయారని ఉక్రెయిన్ నేవీ వెల్లడించింది. తప్పిపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. రిమోట్ ఆధారంగా పని చేసే డ్రోన్‌తో రష్యా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా చేసిన తొలి విజయవంతమైన నావికాదళ డ్రోన్ దాడి ఇదే.
ఇదిలా ఉంటే.. గురువారం (ఆగస్ట్ 28) ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై కూడా డ్రోన్, క్షిపణిలతో విరుచుకుపడింది రష్యా. ఈ దాడుల్లో కనీసం 19 మంది మరణించగా.. దాదాపు 48 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మృతుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నారని వెల్లడించారు.
రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా మండిపడ్డారు. పుతిన్ చిన్న పిల్లలను కూడా చంపుతున్నాడని ఫైర్ అయ్యారు. రష్యా గురువారం (ఆగస్ట్ 28) ఒక్కరోజే కీవ్‌పై దాదాపు 600 డ్రోన్లు, బాలిస్టిక్‌తో సహా 31 క్షిపణులను ప్రయోగించిందని ఆరోపించారు. రష్యా తీరు ఏ మాత్రం మారలేదని.. వారు యుద్ధాన్నే కోరుకుంటున్నారని విమర్శించారు.
ఉక్రెయిన్ ప్రజలు, నగరాలను మాత్రమే కాకుండా ప్రపంచంలో శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరినీ రష్యా దెబ్బతీస్తోందని నిప్పులు చెరిగారు. రష్యా తాజా దాడి ఒక్క ఉక్రెయిన్‌పై మాత్రమే జరిగింది కాదని యూరప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన దాడిగా అభివర్ణించారు జెలెన్ స్కీ. మరీ శాంతి చర్చల కోసం తిప్పలు పడుతోన్న ట్రంప్ రష్యా తీరుపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.