మోడీతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

మోడీతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్.. రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రష్యా.. ఉక్రెయిన్ పై దాడులకు దిగింది. అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్‌ చేశారు. రష్యా తమపై చేస్తున్న దాడి గురించి మోడీకి వివరించారు. ప్రస్తుతం తమ దేశంలో లక్షమందికిపైగా రష్యా సైనికులు ఉన్నారని జెలెన్‌స్కీ తెలిపారు. నిర్దాక్షణ్యంగా జనాలు నివసిస్తున్న రెసిడెన్షియల్ భవనాలపై సైతం దాడులు జరుగుతున్నాయని మోడీకి వివరించారు. భద్రతా మండిలిలో రాజకీయ మద్దతు ఇవ్వాలని మోడీని జెలెన్‌స్కీ కోరారు.రష్యా దురాక్రమణను కలిసికట్టుగా అడ్డుకుందామని తెలిపారు. ఇదే విషయంపై ఆయన ట్వీట్ కూడా చేశారు. రష్యా దూకుడును ఆపాలని జెలెన్‌స్కీ కోరారు. 
 
మరోవైపు ప్రధాని కార్యాలయం కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారని ట్వీట్ చేసింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ పరిస్థితుల గురించి ప్రధానికి వివరించారని పేర్కొంది. ఆ దేశంపై రష్యా దాడుల కారణంగా ప్రాణనష్టం,ఆస్తి నష్టం జరిగినందుకు ప్రధాని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారని పీఎంఓ తెలిపింది.

హింసను తక్షణం నిలిపివేయాలని, చర్చలకు తిరిగి రావాలని ఆయన తన పిలుపును పునరుద్ఘాటించారు. శాంతి ప్రయత్నాలకు ఏ విధంగానైనా సహకరించడానికి భారతదేశం తరపున మోడీ సుముఖత వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులతో సహా భారతీయ పౌరుల భద్రత పట్ల ఆందోళనను కూడా ప్రధాని  ఈ సందర్భంగా తెలియజేశారు. భారతీయ పౌరులను వేగంగా, సురక్షితంగా తరలించడానికి అవసరమైన చర్యల్ని ఉక్రెయిన్ అధికారులు మరింత సులభతరం చేయాలని ప్రధాని కోరారు.

ఇదే విషయంపై ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌తో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవాళ రాత్రి జరిగిన సెక్యూరిటీ కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌)లో తాజా పరిస్థితిని ప్రధాని సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జయ్‌ శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

రష్యా యుద్ధ ట్యాంకులను నిలువరించడానికి ఒకే ఒక్కడు ఏం చేశాడంటే..

అందరినీ సేఫ్ గా తీసుకొస్తాం