అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో అబ్దుల్ రెహ్మాన్ మక్కీ

అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో అబ్దుల్ రెహ్మాన్ మక్కీ

పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థ డిఫ్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేర్చింది. గతేడాది అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ లిస్ట్ లో చేర్చేందుకు చైనా అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాంతో అమెరికా, భారత్ లు చేసిన ప్రతిపాదన మేరకు ఆ నిర్ణయాన్ని టెక్నికల్ హోల్డ్ లో పెట్టింది. మక్కీని ఆల్ ఖైజా ఆంక్షల కమిటీ కింద అంతర్జాతీయ ఉగ్రవాదిగా జాబితాలో చేర్చాలని గతేడాది జూన్ లోనే భారత్, అమెరికా సంయుక్తంగా ప్రతిపాదించాయి. దీన్ని నో అబ్జెక్షన్ విధానం కింద కమిటీలోని  సభ్యదేశాలకు కూడా పంపించాయి. అప్పట్లో జూన్ 16 వరకు గడువు ఇచ్చినప్పటికీ.. చివరి సమయంలో చైనా అడ్డుపడడంతో ప్రతిపాదనను హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది.

గతంలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను కూడా ఈ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రతిపాదించింది. కానీ చైనా ఇదే తరహాలో 4 సార్లు అడ్డుకుంది. కానీ అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో 2019లో వెనక్కి తగ్గింది. ఎల్ఈటీ వ్యవస్థాపకుడు 2611 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ దగ్గరి బంధువైన మక్కీ.. లష్కరే తోయిబాతో పాటు జమాద్ ఉద్ దవాలోనూ నాయకత్వ పదవులను కలిగి ఉన్నాడు. ముఖ్యంగా భారత్ లోని జమ్ము కశ్మీర్ లో ఉగ్ర దాడులకు ప్రణాళికలు చేయడం, నిధుల సేకరణ, యువతను ప్రోత్సహించడం వంటి అనేక నేరాల్లోనూ అతని హస్తం ఉంది. దేశీయ చట్టాల ప్రకారం భారత్, అమెరికా ఇప్పటికే మక్కీని ఉగ్రవాదిగా గుర్తించాయి.