
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా భూమిపై చాలా వైపరిత్యాలు, పరిణామామలు చోటుచేసుకుంటున్నాయి. భూమిపై రోజురోజుకీ పెరుగుతున్న వేడి కారణంగా జీవజాలం ఇప్పటికే ప్రమాదంలో పడ్డ ఈ తరుణంలో.. తాజాగా ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం- ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ ఓ కీలక ప్రకటన చేసింది. ఇండో- గంగా నదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు క్షీణించాయని ఇంటరాక్టెడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది.
భూగర్భ జలాలు క్షీణించడానికి పర్వతాలు కరిగిపోవడం, అంతరిక్ష వ్యర్థాలు, భూమిపై అధిక వేడి వంటివి కారణాలని ఈ నివేదిక తెలిపింది. భూమిలోని నీటిని దాదాపు 70శాతం వ్యవసాయానికి వినియోగిస్తుండగా.. కరువు లాంటి పరిస్థితుల వల్ల జలాశయాలు సైతం ఎండిపోతున్నాయని యూఎన్ నివేదిక వివరించింది. దీంతో పాటు బావుల్లోనూ నీటి మట్టాలు తగ్గిపోయి.. రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ పరిణామాల వల్ల ఆహారోత్పత్తి వ్యవస్థకు సైతం ప్రమాదం ఏర్పడే అవకాశముందని నివేదిక హెచ్చరించింది. ఇప్పటికే సౌదీ వంటి పలు దేశాలు భూగర్భ జలాల కొరతతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. అమెరికా, చైనా దేశాల కంటే భారతదేశంలో భూగర్భ జలాల వినియోగం ఎక్కువ కావడం మరింత ఆందోళన కలిగించే విషయంగా మారింది.
భారతదేశంలో దాదాపు 1.4బిలియన్ల మంది రైతులు భూగర్భ జలాలతో పంటలు పండిస్తున్నట్టు సమాచారం. పంజాబ్ లో 78శాతం పంటలు బావుల నుంచి వచ్చే భూగర్భ జలాలతో పండుతున్నాయి. అయితే 2025నాటికి ఈ జలాల లభ్యత తగ్గుతుందని.. అదే గనక జరిగితే పెనుముప్పు తప్పదని ప్రపంచ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.