కరోనా దెబ్బ నుంచి కోలుకోలేక వందల కాలేజీలు మూసివేత

కరోనా దెబ్బ నుంచి కోలుకోలేక వందల కాలేజీలు మూసివేత
  • నిర్వహణ భారమవడంతో మేనేజ్​మెంట్ల నిర్ణయం
  • చేవెళ్ల పరిధిలో వంద వరకు ఇంజనీరింగ్​ కాలేజీల ఎత్తివేత
  • కొన్ని మెడికల్, పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కోర్సులకు మార్పు 
  • మరికొన్ని భవనాల్లో గురుకులాలకు అద్దెకు కొనసాగింపు 
  • స్టూడెంట్ల సందడి లేక వెలవెలబోతున్న భవనాలు

చేవెళ్ల, వెలుగు:  కరోనా దెబ్బ.. మరోవైపు ఫీజు రీయింబర్స్​మెంట్​లేట్​కారణంగా మేనేజ్​మెంట్లకు నిర్వహణ భారంగా మారడంతో ఇంజనీరింగ్ కాలేజీలను ఎత్తేస్తున్నారు. విద్యార్థులు కూడా ఎక్కువగా ఇంజనీరింగ్​లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో  కోర్సులకు ఆదరణ తగ్గిపోయి అడ్మిషన్లు సరిగా రాకపోతుండగా మేనేజ్​మెంట్లు కాలేజీలను మూసివేస్తున్నాయి.  దీంతో  పెద్ద పెద్ద భవనాలు భూత్ బంగ్లాలుగా మారుతున్నాయి. 

ఉమ్మడి ఏపీలో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అన్ని వర్గాల  స్టూడెంట్లకు  ఫీజు రీయింబర్స్​మెంట్​అవకాశం కల్పించగా లక్షల సంఖ్యలో స్టూడెంట్లు ఇంజనీరింగ్​ కోర్సుల్లో చేరారు. డబ్బు చెల్లించే స్థోమత లేని వారు కూడా  ఫీజు రీయింబర్స్​మెంట్​ పొంది ఇంజనీరింగ్​ పూర్తి చేసేవారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఫీజు రీ యింబర్స్​మెంట్​ రూల్స్ కఠినంగా మారడంతో ఏండ్ల వరకు బకాయిలు రాకపోతుండగా కాలేజీలు కోలుకోలేనంతగా నష్టపోయాయి. కొన్నేళ్ల కిందట ఒక్కో కాలేజీలో వేల సంఖ్యలో విద్యార్థులు ఉండగా, ఇప్పుడు వందలు, పదుల సంఖ్యకు పడిపోయింది. కాలేజీ మెనేజ్​మెంట్లకు ఫీజు రీయింబర్స్​మెంట్​స్కీమ్​ వరంగా మారడంతో ఒక్కో కాలేజీలోనే పదుల సంఖ్యలో కోర్సులకు పర్మిషన్లు తీసుకుని కోట్లలో ఫీజు రీయింబర్స్​మెంట్​పొందేవి. కొన్ని కాలేజీల్లో స్టూడెంట్లు లేకున్నా, కోట్లలో తీసుకున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి .  
కొత్త కోర్సులతో నెట్టుకొస్తుండగా..
 వేలాది మంది స్టూడెంట్లతో కళకళలాడిన ఇంజనీరింగ్ కాలేజీల కొనసాగింపు ఇప్పుడు  ప్రశ్నార్థకంగా మారింది. చాలావరకు  పూర్తిగా మూత పడగా కొన్ని కాలేజీలు మాత్రం ఇతర కోర్సులతో  నెట్టుకొస్తున్నాయి . ఎంబీఏ ,ఎంసీఏ లాంటి కోర్సులకు సైతం డిమాండ్ తగ్గిపోవడంతో పాలిటెక్నిక్, అగ్రికల్చర్ తదితర కోర్సులతో ఏదోలా మేనేజ్​మెంట్లు నెట్టుకొస్తున్నాయి.  కొన్ని కాలేజీలు ఇంజనీరింగ్, ఎంబీఏ కోర్సులను పూర్తిగా తీసి వేసి, మెడికల్ కాలేజీలుగా మార్పు చేసుకున్నాయి. మరికొన్ని కాలేజీల భవనాలు ప్రభుత్వ గురుకులాలకు అద్దె కింద కొనసాగుతున్నాయి.

చేవెళ్ల డివిజన్ పరిధిలోనే సుమారు 118 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి . ఒక్కో కాలేజీ క్యాంపస్ ఆవరణలో నాలుగు నుంచి పది దాకా వేర్వేరు పేర్లతో కొనసాగించేవారు.  ఇప్పుడు సుమారు  వంద కాలేజీల దాకా మూతపడ్డాయి . ఇందులో కొన్ని మెడికల్, పాలిటెక్నిక్ తదితర ప్రత్యామ్నాయ కోర్సులతో నడుపుతుండగా మరికొన్నింటిని పూర్తిగా మూసివేశారు. 
111 జీవో  కారణంగా..
 111 జీవోతో  కాలేజీల భవనాలకు చాలావరకు అనుమతులు లేవు . గతంలో అధికారులు చూసీ చూడనట్లుగా ఉండడంతో అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు. ప్రస్తుతం ఆయా భవనాల్లో కాలేజీలు కొనసాగించేందుకు అనుమతులు రావడం లేదు. దీంతో కొన్ని కాలేజీలను మూసివేశామని నిర్వాహకులు చెబుతున్నారు. 
ఇంటర్, డిగ్రీ కాలేజీలదీ అదే పరిస్థితి 
 ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఇలా ఉంటే,  ఇంటర్ ,డిగ్రీ  కాలేజీలు సేమ్​ టూ సేమ్​.  గతంలో ఫీజు రీయింబర్స్​మెంట్ రావడంతో సాఫీగా కొనసాగిన ఇంటర్ కాలేజీలు  ఏండ్లుగా బకాయి లను ప్రభుత్వం విడుదల చేయకపో తుండగా మేనేజ్​మెంట్లు  నడపలేక పలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనాతో కాలేజీలు నడవక స్టూడెంట్ల నుంచి సరిగా ఫీజులు వసూలు మరింత నష్టాల్లోకి పోయాయి.  
కాలేజీ మూతపడగా జాబ్​ పోయింది 
ఇంజినీరింగ్​కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తుండగానే మూత పడగా జాబ్ లోంచి తీసేశారు. మా ఊరిలోనే కాలేజీ ఉండగా చాలామందికి ఉపాధి దొరికేది.  ప్రస్తుతం జాబ్ లు పోయి కొందరు ఖాళీ ఉండగా, మరికొందరు సిటీకి వెళ్లి దొరికిన జాబ్​ చేసుకుంటూ  ప్రతి రోజూ వెళ్లొస్తున్నారు.  - చంద్రయ్య,ల్యాబ్ అసిస్టెంట్, బీఎస్ఐటీ, చేవెళ్ల
కొత్తగా అడ్మిషన్లు తీసుకోవట్లే 
ప్రస్తుతం కాలేజీలో కొత్తగా అడ్మిషన్లు తీసుకోవట్లేదు. ఫస్ట్​, సెకండియర్​ స్టూడెంట్లకు  క్లాసులు నడవట్లేదు. థర్డ్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్లకు మాత్రమే చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి కాలేజీలో ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిగా బంద్ ​పెట్టనున్నారు.  - ఉమా మహేశ్వరి , ఈసీఈ థర్డ్​ ఇయర్,​బండారి శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజ్, చేవెళ్ల
ఎప్పుడూ సందడిగా కనిపించేవి
సాగర్ కాలేజీలో ఎంబీఏ చేశా. చేవెళ్ల, మొయినాబాద్ ఏరియాల్లో వేలాది మంది స్టూడెంట్లతో సందడిగా కనిపించేది. స్థానికంగా చాలామందికి  ఉపాధి కూడా దొరికేది. ఇప్పుడు చాలా కాలేజీలు మూతపడగా, ఉన్న కొన్ని కాలేజీల్లో ఇతర కోర్సులతో నడిపిస్తున్నారు. కొన్నింటిని అద్దెకు ఇచ్చారు. -  కరుణాకర్ రెడ్డి , ఓల్డ్ స్టూడెంట్, సాగర్ కాలేజ్, చేవెళ్ల