ఖమ్మంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై కసరత్తు

ఖమ్మంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై కసరత్తు
  • ముగిసిన రెండో దశ నామినేషన్ల గడువు
  • అర్ధరాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ 
  • మొదటి దశలో ఉపసంహరణకు ఇవాళ ఆఖరు

ఖమ్మం, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై కసరత్తు జరుగుతోంది. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ఈ రోజుతో నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగియనుంది. దీంతో ప్రత్యర్థులతో విత్ డ్రా చేయించేందుకు, గ్రామాల్లో చర్చలు, బేరసారాలు జరుగుతున్నాయి. పార్టీల వారీగా కొన్ని చోట్ల చర్చలు నడుస్తుండగా, మరికొన్ని చోట్ల అభ్యర్థులే చొరవ తీసుకొని బరిలో ఉన్న ఇతరులతో చర్చిస్తున్నారు. 

గ్రామాభివృద్ధి కోసం ఎవరెన్ని నిధులు ఖర్చు చేస్తారో ముందుకు రావాలని గ్రామంలోని పెద్ద మనుషులు కూడా పోటీలో ఉన్న వారితో మాట్లాడుతున్నారు. మరోవైపు సర్పంచ్, కొన్ని వార్డు సభ్యులను ఒక పార్టీ లీడర్లు తీసుకొని, మరో పార్టీకి చెందిన వారికి ఉప సర్పంచ్​, మరికొన్ని వార్డు సభ్యులను కేటాయించేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి అంగీకారాలు కుదిరిన చోట నామినేషన్లను విత్ డ్రా చేయించాలని నిర్ణయించారు. 

జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే 192 గ్రామాల్లో నామినేషన్ల తిరస్కరణ తర్వాత మొత్తం నామినేషన్లు 1142కు గాను 215 తిరస్కరించడంతో 927 నామినేషన్లు మిగిలాయి. ఇక 1740 వార్డులకు దాఖలైన 4054 నామినేషన్లలో 73 తిరస్కరించగా, 3981 నామినేషన్లు మిగిలాయి. ఇవాళ సాయంత్రంతో నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసిన తర్వాత మొదటి విడతలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే వారి వివరాలతో పాటు, బరిలో ఉన్న వారి తుది జాబితాను ఆఫీసర్లు ప్రకటించనున్నారు.

రెండో విడతకు ముగిసిన నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్​, కూసుమంచి, తిరుమలాయపాలెం, ముదిగొండ, నేలకొండపల్లి, కామేపల్లి మండలాల్లో 183 సర్పంచ్​, 1686 వార్డు స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగిసినా, సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్​ లో నిలుచున్న వారిని నామినేషన్ వేసేందుకు అనుమతించారు. దీంతో అర్థరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. సోమవారం వరకు 183 గ్రామ సర్పంచ్​ ల కోసం 428 నామినేషన్లు రాగా, 1686 వార్డుల కోసం 931 నామినేషన్లు ఫైలయ్యాయి. 

మరోవైపు మొదటి విడత ఎన్నికలు జరిగే కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఇప్పటికే కొన్ని ఏకగ్రీవమయ్యాయి. ఇక మూడో విడత ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్​ విడుదల కానుంది. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, కారేపల్లి మండలాల్లో ఎన్నికలు మూడో విడతలో జరగనున్నాయి. వీటిలో ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మొదటి విడత ఎన్నికలు 11, రెండో విడత ఎలక్షన్లు 14, మూడో విడత ఎన్నికలు 17న జరగనున్నాయి. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే ఫలితాలను వెల్లడించనున్నారు.