- రూ.లక్షల్లో చెల్లించి సర్పంచ్ పదవులు దక్కించుకుంటున్న లీడర్లు
- పలుచోట్ల వేలం పాటలు నిర్వహిస్తున్న వీడీసీలు
నెట్వర్క్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి, పోటీలను నివారించి ఐక్యతను చాటుకోవాలని కొన్ని గ్రామాల్లో ప్రజలు సమావేశమై ఏకగ్రీవాల కోసం ప్రయత్నించారు. అయితే మరికొన్నిచోట్ల వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఎలాగైనా సర్పంచ్ పదవి దక్కించుకోవాలని ఆశిస్తున్నవారి మధ్య పోటీ నెలకొనడంతో పదవులకు డిమాండ్ పెరిగింది.
సర్పంచ్ పోస్టు కోసం 50 నుంచి 60 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధపడడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి నిధుల సమీకరణ పేరిట విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు గురువారం అనేక గ్రామాల్లో ఓపెన్‌గా పదవుల వేలం నిర్వహించాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అనుబంధ గ్రామమైన రాంపూర్ కు చెందిన ఆడే భూమాబాయి, ఉప సర్పంచ్ గా వాస్తాపూర్ కు చెందిన పెందూరు సంతోష్ తో పాటు 8 మంది వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని నాలుగు గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్టీ రిజర్వ్‌డ్ అయిన ఈ పంచాయతీల ప్రజలు పోటీ వద్దని నిర్ణయం తీసుకున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సాలెగూడ, మోహన్ గూడ, తేజాపూర్, ధోబిగూడ గ్రామాల పటేళ్లు, గ్రామస్తులు సమావేశమై మాజీ ఎంపీటీసీ కోవ రాజేశ్వర్ ను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇదే మండలంలోని వాల్గోండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల పటేళ్లు సమావేశమై కనక సునీతను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని మెండపల్లి గ్రామ సర్పంచ్ గా కొడప శ్రీరామ్, ఉప సర్పంచ్ గా ముండె మొహన్ రావును ఎన్నుకున్నారు. సిరికొండ మండలంలోని రాయిగూడ సర్పంచ్ గా పెందూర్ లక్ష్మణ్ ను, 8 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో సర్పంచ్, వార్డు సభ్యులను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రూ.60 లక్షలు ఇచ్చి సర్పంచ్ పదవి కైవసం
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో రెండు గ్రామాల్లో ఏకగ్రీవానికి లక్షల్లో 'వేలం పాట' జరిగింది. జగదేవ్ పూర్ మండలం బీజీ వెంకటాపూర్‌లో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించగా పరమేశ్వర్ అనే వ్యక్తి గ్రామభివృద్ధి కోసం రూ.13.60 లక్షలు డిపాజిట్ చేయడానికి సిద్ధపడ్డారు.
ఈ మేరకు గ్రామపెద్దలకు చెక్ ఇచ్చారు. మరో ఇద్దరు కూడా నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవ ప్రయత్నం బెడిసికొట్టినట్లయింది. జోగుళాంబ గద్వాల జిల్లా కొండపల్లిలో గుడి డెవలప్మెంట్ కోసం రూ. 60 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి సర్పంచ్ పదవి కైవసం చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గట్టు మండలం చింతలకుంట సర్పంచ్ పదవిని రూ.38.50 లక్షలకు రాజశేఖర్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. ధరూర్ మండలం జాంపల్లి సర్పంచ్ పదవిని ఒక వ్యక్తి రూ.16 లక్షలకు దక్కించుకున్నారు.
