తట్టుకోలేక పోతున్నాం మా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది

తట్టుకోలేక  పోతున్నాం మా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది

న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్​ నుంచి తప్పుకున్న సీఎస్​కే స్టార్​ బ్యాట్స్​మన్​ సురేశ్​ రైనా తొలిసారి స్పందించాడు. పంజాబ్​లో తమ బంధువుల (మేనత్త) ఫ్యామిలీకి చాలా ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వీలైనంత త్వరగా తమ వారికి న్యాయం చేయాలని గవర్నమెంట్​కు విజ్ఞప్తి చేశాడు. జరిగిన దుర్ఘటనకు సంబంధించి ట్వీట్​ చేశాడు. ‘పంజాబ్​లో మా ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగింది. దుండగులు జరిపిన దాడిలో మా అంకుల్, కజిన్​ చనిపోయారు. మా మేనత్తకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నారు.  ఆ రోజు ఏం జరిగిందనే విషయంపై ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. ఇంతటి ఘోరాన్ని మేం తట్టుకోలేకపోతున్నాం. దీనికి బాధ్యులెవరో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. మరిన్ని ఘోరాలు చేయకముందే నేరస్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. వీలైనంత త్వరగా పంజాబ్​ పోలీసులు ఈ కేసును దర్యాప్తు పూర్తి చేసి మాకు న్యాయం చేయాలి’ అని రైనా వరుస ట్వీట్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ ట్వీట్​లో పంజాబ్​ సీఎం అమరిందర్​ సింగ్​ను ట్యాగ్​ చేశాడు. దీనిపై అమరిందర్ వెంటనే స్పందించారు.  సీఎం ఆదేశాలతో ఈ ఘటనపై విచారణకు సిట్​ ను ఏర్పాటు చేసినట్టు పంజాబ్‌‌‌‌‌‌‌‌ డీజీపీ ప్రకటించారు.