వరల్డ్ కప్: ఇవాళ అఫ్గాన్ తో ఇండియా పోరు

 వరల్డ్ కప్: ఇవాళ అఫ్గాన్ తో ఇండియా పోరు

ఆరంభంలోనే మేటి జట్లపై విజయాలు.. మధ్యలో వారం రోజుల విశ్రాంతి.. ఆటగాళ్లందరూ తాజాగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో.. వరల్డ్‌‌కప్‌‌లో టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే లీగ్‌‌ మ్యాచ్‌‌లో అఫ్గానిస్థాన్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌‌పై  పెద్దగా ఆసక్తి లేకపోయినా.. విరాట్‌‌సేన బ్యాటింగ్‌‌ రికార్డులు బద్దలు కొడుతుందని అభిమానులు భావిస్తున్నారు. కేవలం సెమీస్‌‌ బెర్త్‌‌ కోసమే గెలవడం కాకుండా.. మంచి రన్‌‌రేట్‌‌ను నమోదు చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. సౌతాఫ్రికా, పాకిస్థాన్‌‌, ఆస్ట్రేలియాపై విజయాలతో జోరుమీదున్న టీమిండియాను గాయాలు వెంటాడుతున్నా.. ఇప్పటికీ శత్రుదుర్భేద్యంగానే కనిపిస్తున్నది. కాబట్టి ఏకపక్షం తప్పదనుకుంటున్న ఈ మ్యాచ్‌‌లో టీమిండియానే ఫేవరెట్‌‌. మరోవైపు ఇప్పటివరకు బోణీ కొట్టని అఫ్గాన్‌‌.. ఇండియాపై సంచలనం చేసి అందరి దృష్టిని తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నది. కానీ ఇదంత సులభంగా జరిగేది మాత్రం కాదు. ఓవరాల్‌‌గా ఆడిన ఐదు మ్యాచ్‌‌ల్లో ఓడి సెమీస్‌‌ రేసుకు దూరమైన అఫ్గాన్‌‌ ఏం చేస్తుందో చూడాలి..!

తుది కూర్పు ఎలా?…

ధవన్‌‌, భువనేశ్వర్‌‌ గైర్హాజరీ.. రిషబ్‌‌ పంత్‌‌ రాక.. ప్రాక్టీస్‌‌లో విజయ్‌‌ శంకర్‌‌ గాయపడటం.. ఇలాంటి అంశాల నేపథ్యంలో టీమిండియా తుది కూర్పుపై ఆసక్తి మొదలైంది. ఓపెనింగ్‌‌లో రోహిత్‌‌కు ఎదురులేదు. అవకాశం వస్తే నాలుగో డబుల్‌‌ సెంచరీ కొట్టడానికి కూడా ఈ ముంబైకర్‌‌ సిద్ధంగా ఉన్నాడు. పాక్‌‌పై అర్ధసెంచరీ రాహుల్‌‌లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న విరాట్‌‌.. మరో రికార్డుపై కన్నేశాడు. ఈ టాప్‌‌––3 చెలరేగితే.. అఫ్గాన్‌‌కు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికైతే నాలుగో స్థానం విజయ్‌‌ శంకర్‌‌కే కేటాయించినా.. పిచ్‌‌, వాతావరణ పరిస్థితులను చూసి చివరి నిమిషాల్లో రిషబ్‌‌కు కట్టబెట్టినా ఆశ్చర్యం లేదు. అప్పుడు దినేశ్‌‌ కార్తీక్‌‌ నుంచి పోటీ తప్పకపోవచ్చు. ఒకవేళ ప్రయోగాలు చేయాలని కోహ్లీ భావిస్తే.. రిషబ్‌‌కే గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇవ్వొచ్చని సమాచారం. రాబోయే మ్యాచ్‌‌లను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌‌లో కేదార్‌‌కు లైనప్‌‌లో ప్రమోషన్‌‌ దక్కే అవకాశం ఉంది. గత మూడు మ్యాచ్‌‌ల్లో అతను ఎనిమిది బంతులే ఆడాడు. అఫ్గాన్‌‌పై కేదార్‌‌ బ్యాటింగ్‌‌ను పరీక్షించుకోవాలని మేనేజ్‌‌మెంట్‌‌ సిద్ధమవుతున్నది. ధోనీ, పాండ్యా ఫినిషర్లుగా చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌‌ విషయానికొస్తే… భువనేశ్వర్‌‌కు గాయం కావడం వల్ల షమీకి లైన్‌‌ క్లియర్‌‌ అయ్యింది. గత మూడు మ్యాచ్‌‌ల్లో రిజర్వ్‌‌ బెంచ్‌‌కే పరిమితమైన అతను అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు. బుమ్రాతో కలిసి కొత్త బంతిని పంచుకోనున్నాడు. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌‌, చహల్‌‌ను అనుభవం లేని అఫ్గాన్‌‌ వీరులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

బోణీ చేస్తారా?..

మరోవైపు అఫ్గానిస్థాన్‌‌ సంచలనంపై దృష్టి పెట్టింది. అయితే ఆ జట్టులో నైపుణ్యం ఆటగాళ్లకు కొదువలేకపోయినా.. అంతర్గత విభేదాలు జట్టును పీడిస్తున్నాయి. వెటరన్‌‌ వికెట్‌‌ కీపర్‌‌ను తొలిగించడంతో సమస్యలు రెట్టింపయ్యాయి. టీమ్‌‌ను కెప్టెన్‌‌, కోచ్‌‌లో ఎవరు నడిపిస్తున్నారో క్లారిటీ లేదు.  దీంతో తుది జట్టులో కచ్చితంగా మార్పులు ఉంటాయని సమాచారం. బ్యాటింగ్‌‌ భారం హజ్రతుల్లా, హష్మతుల్లా, అస్గర్‌‌పైనే పడనుంది. షమీ, బుమ్రాను ఓ మాదిరిగా ఆడినా.. కుల్చా ద్వయాన్ని ఆడటం వీళ్లకు కొత్త. జట్టు మొత్తంలో అంతర్జాతీయ స్థాయి రషీద్‌‌ ఖాన్‌‌కు మాత్రమే ఉంది. కానీ మోర్గాన్‌‌ చేతిలో చావుదెబ్బ తిన్న ఈ స్పిన్నర్‌‌.. ఆత్మవిశ్వాసంతో బౌలింగ్‌‌ చేస్తాడా?  స్పిన్‌‌ ఆడటంలో టీమిండియాకు ఎదురులేదు. కాబట్టి ఈ మ్యాచ్‌‌లో ఒకే ఒక్క స్పిన్నర్‌‌తో ఆడి ఎక్స్‌‌ట్రా పేసర్‌‌ లేదా బ్యాట్స్‌‌మన్‌‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తున్నది.  పేస్‌‌ బౌలింగ్‌‌లో ఆఫ్తాబ్‌‌ ఆలమ్‌‌, నైబ్‌‌ ఆరంభంలో వికెట్లు తీస్తే ఇండియాను కొద్దిగానైనా కట్టడి చేయొచ్చు. ఏదేమైనా టీమిండియా స్టార్‌‌ లైనప్‌‌ను నిలువరించాలంటే అఫ్గాన్‌‌ శక్తికి మించి శ్రమించాల్సిందే.