
అగర్తల: తన ప్రియుడితో లేచిపోయేందుకు ఓ తల్లి ఐదు నెలల తన పసిపాపను గొంతునులిమి చంపేసింది. త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఈ దారుణం జరిగింది. నిందితురాలిని సుచిత్రా దేవ్ వర్మగా గుర్తించారు. జిల్లాలోని సోనమ్ పురలో సుచిత్ర కుటుంబం నివసిస్తోంది. ఆమె భర్త కూలీగా పనిచేస్తున్నాడు. అయితే, సంవత్సరం క్రితం ఒకరితో సుచిత్రకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఎలాగైనా అతడితో లేచిపోవాలని ప్లాన్ చేసింది.
ఇందుకు తన ఐదు నెలల బిడ్డ అడ్డుగా ఉందని భావించింది. దీంతో పసిపాపను గొంతునులిమి చంపి ప్రియుడితో లేచిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మంచంపై పసిపాప కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. నిందితరాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రియుడి కోసం తన బిడ్డను హత్య చేశానని సుచిత్ర ఒప్పుకుంది.