అవకాశం ఇస్తే హైదరాబాద్‌‌ యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తా: వరల్డ్ కప్‌‌ విన్నర్ సయ్యద్ కిర్మాణీ

అవకాశం ఇస్తే హైదరాబాద్‌‌ యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తా: వరల్డ్ కప్‌‌ విన్నర్ సయ్యద్ కిర్మాణీ

హైదరాబాద్, వెలుగు: కోచ్‌‌, సపోర్ట్ స్టాఫ్‌‌, ఫిజియో అంటూ ఎవ్వరూ లేకుండానే తాము 1983 వరల్డ్ కప్‌‌ గెలిచి చరిత్ర సృష్టించామని నాటి ఇండియా టీమ్ మెంబర్‌‌‌‌, హైదరాబాదీ సయ్యద్ కిర్మాణీ చెప్పాడు. నాటికి, నేటికి క్రికెట్‌‌లో చాలా మార్పు వచ్చిందన్నాడు. హైదరాబాద్‌‌లో పుట్టిన తాను ఈ గడ్డ కోసం ఏదైనా చేయాలని అనుకుంటున్నానని, అవకాశం ఇస్తే ఇక్కడి యువ క్రికెటర్లకు మెంటార్‌‌‌‌గా మార్గదర్శనం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. హైదరాబాద్‌‌లో తన ఆత్మకథ ‘స్టంప్డ్‌‌’ను ఆవిష్కరించిన కిర్మాణీ ‘వెలుగు’ ఇంటర్వ్యూలో  సిటీతో తన అనుబంధం, 1983 వరల్డ్ కప్‌‌ జ్ఞాపకాలను పంచుకున్నారు. 

అది ఊహకు అందని క్షణం

1983 విజయం మా ఊహకు అందని క్షణం. ఆ టోర్నీలో మేము నాలుగో బలహీనమైన జట్టుగా బరిలోకి దిగాం. ఆ గెలుపు ఇండియాకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశ ప్రజలందరికీ కీర్తిని తెచ్చిపెట్టింది. మన దేశంలో క్రికెట్ రూపురేఖలనే మార్చేసింది. ఆ తర్వాత క్రికెట్ ఒక మతంగా మారిపోయింది. మా కాలం నాటి క్రికెట్‌‌కు, నేటి క్రికెట్‌‌కు చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. ఇప్పటి మాదిరిగా మా కాలంలో టెక్నాలజీ లేదు. మాకు కోచ్, సపోర్ట్ స్టాఫ్, ఫిజియోథెరపిస్ట్ అంటూ ఎవ్వరూ సాయం చేయలేదు. ఎలాంటి సహాయక సిబ్బంది లేకుండానే మేం వరల్డ్ కప్ గెలిచాం. అందువల్ల, మేము సాధించిన విజయాల్లో అదే అత్యంత చిరస్మరణీయమైనది.

ఎవ్వరికీ భయపడలేదు

మేము మా కెరీర్ మొత్తం సరైన రక్షణ పరికరాలు, హెల్మెట్‌‌లు లేకుండానే ఆడాము. మాకు ఏ కోచ్‌‌లు లేరు. గొప్ప ఆటగాళ్లను గమనించి మాకు మేమే నేర్చుకున్నాము. మాల్కం మార్షల్, మైఖేల్ హోల్డింగ్, డెన్నిస్ లిల్లీ వంటి ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లను ఎదుర్కొన్నాం. జీవితంలో ఏ పనిలోనైనా భయపడితే విఫలమవుతారు. భయపడాల్సిన అవసరం లేదు. అతను ఫాస్ట్ బౌలర్ అయితే ఏంటి? నా దగ్గర బ్యాట్ ఉంది అనే పట్టుదల ప్రతి ఒక్కరిలో ఉండాలి. భయపడొద్దు, ఆందోళన చెందొద్దు, వదిలిపెట్టొద్దు. యువ క్రీడాకారులకు ఇదే నా సలహా అప్పుడే బెస్ట్ ప్లేయర్ అవుతాడు.

నాకు ప్రత్యేకంగా ఇష్టమైన ప్లేయర్‌‌ అంటూ ఎవరూ లేరు. ఏ ఆటగాడైనా తమ శక్తి మేరకు రాణిస్తే నేను ప్రశంసిస్తాను. కేవలం ఒక టోర్నమెంట్‌‌లో బాగా ఆడినంత మాత్రాన బెస్ట్ ప్లేయర్ కాలేరు. నిలకడైన ఆటతో బెస్ట్ ప్లేయర్‌‌‌‌గా మారడానికి సంవత్సరాలు పడుతుంది. అదే కీలకం కూడా. ప్రస్తుత టీమిండియా బాగుంది. ఇటీవలే ఇంగ్లండ్‌‌లో అద్భుతమైన సిరీస్‌‌ ఆడింది. ఇరు జట్లలోని ఆటగాళ్లంతా యువకులే, ఐదు టెస్ట్ మ్యాచ్‌‌లలోనూ వారు చాలా ఉత్కంఠభరితమైన, పోటీతత్వంతో కూడిన క్రికెట్‌‌ ఆడారు. ముఖ్యంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌ సిరీస్ అంతటా సూపర్ పెర్ఫామెన్స్ చేశాడు.  

నేను తెలంగాణ బిడ్డను

వరల్డ్ కప్‌‌ విజయం తర్వాత నా బుక్‌‌ను హైదరాబాద్‌‌లో లాంచ్ చేయడం లైఫ్‌‌లో మరో మధురఘట్టం. నేను తెలంగాణ బిడ్డను. హైదరాబాద్‌‌లో పుట్టాను. ఆల్ సెయింట్స్ హైస్కూల్‌‌లో నాలుగో తరగతి వరకూ చదువుకున్నా. మా నాన్న అప్పటి ప్రభుత్వంలో స్టెనోగ్రాఫర్‌‌గా పనిచేసేవారు. రాష్ట్రాల పునర్విభజనతో ఆయన మైసూరుకు ట్రాన్స్ ఫర్ అయ్యారు. అలా నా బాల్యం మొత్తం బెంగళూరులోనే గడిచింది. కానీ మా కుటుంబం మొత్తం తెలంగాణ, హైదరాబాద్‌‌లోనే ఉంది.

 మా నాన్న ఇల్లు ఇప్పటికీ మల్లేపల్లిలో ఉంది. అందుకే నా ఆత్మకథను హైదరాబాద్‌‌లో ఆవిష్కరించడం నా విధిగా భావించాను. నేను బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీకి కన్సల్టింగ్ డైరెక్టర్‌‌గా, అలాగే కర్నాటక స్టేట్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌‌గా ఉన్నా. హైదరాబాద్,  తెలంగాణలో నా అనుభవాన్ని పంచుకోవడానికి నన్ను ఆహ్వానిస్తే నేను చాలా సంతోషిస్తాను. తెలంగాణ, హైదరాబాద్ యువ క్రికెటర్లకు మెంటార్‌‌గా ఉండటానికి నేను మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నా.