నేపాల్ టార్గెట్ 185 రన్స్.. 19 ఓవర్లలో ఆ టీమ్ స్కోరు 175/6.. విజయానికి చివరి 6 బాల్స్‌లో 10 రన్స్ అవసరం. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన లోకేశ్ బామ్ సూపర్ షాట్లు ఆడుతున్నాడు. ఏమాత్రం తేడా వచ్చినా తమ క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లండ్ ఘోరమైన ఓటమిని ఎదుర్కొనే పరిస్థితి. కానీ చివరి ఓవర్లో పేసర్ సామ్ కరన్ వరుసగా యార్కర్స్ వేసి లోకేశ్‌ను కట్టడి చేయడంతో పాటు 5 రన్సే ఇవ్వడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. 4 రన్స్ స్వల్ప తేడాతో ఓడినా.. ఇంగ్లండ్‌ను వణికించిన నేపాల్ క్రికెటర్లు తమ ఖతర్నాక్ ఆటతో వరల్డ్ క్రికెట్ దృష్టిని ఆకర్షించారు..!
ముంబై: టీ20 వరల్డ్ కప్‌లో పసికూన నేపాల్ ఇంగ్లండ్‌కు చుక్కలు చూపెట్టింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో చివరి వరకు ఇంగ్లిష్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. లక్ష్య ఛేదనలో దీపేంద్ర సింగ్ ఆరీ (29 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 44), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (34 బాల్స్‌లో 2 ఫోర్లు, సిక్స్‌లతో 39), లోకేశ్ బామ్ (20 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) చివరి వరకు పోరాడినా.. ఆదివారం జరిగిన గ్రూప్–సి తొలి మ్యాచ్‌లో నేపాల్ 4 రన్స్ స్వల్ప తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసింది. జాకబ్ బెథెల్ (35 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (32 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలు సాధించారు. విల్ జాక్స్ (39 నాటౌట్) చెలరేగాడు. తర్వాత నేపాల్ 20 ఓవర్లలో 180/6 స్కోరు చేసింది. ఓ వికెట్ కూడా తీసిన విల్ జాక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఆఖర్లో దంచారు..
రెండో ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్ (1)ని ఔట్ చేసి నేపాల్ బౌలర్ షేర్ మల్లా (1/35) ఇంగ్లండ్‌కు ఝలక్ ఇచ్చాడు. 5/1 వద్ద బట్లర్ (26)కు తోడైన బెథెల్ వచ్చి రావడంతోనే 4, 6, 4తో భారీ షాట్లకు తెరలేపాడు. బట్లర్ నాలుగు ఫోర్లతో ముందుకొచ్చినా.. 4వ ఓవర్‌లో నందన్ యాదవ్ (2/25)కు వికెట్ ఇచ్చాడు. రెండో వికెట్‌కు 38 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఆరో ఓవర్‌లో బెథెల్ 6, 4 కొట్టడంతో పవర్‌ప్లేలో ఇంగ్లండ్ 57/2 స్కోరు చేసింది.
కానీ ఏడో ఓవర్‌లోనే బాంటన్ (2)ను లామిచానె (1/25) ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 57/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో బెథెల్‌కు జతైన బ్రూక్ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టాడు. ఫస్ట్ టెన్‌లో ఇంగ్లిష్ జట్టు 84/3తో నిలిచింది. 4, 6తో బెథెల్ 28 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు.
ఆ వెంటనే బ్రూక్ కూడా 4, 6, 6 దంచాడు. కానీ 14వ ఓవర్‌లో దీపేంద్ర.. బెథెల్‌ను వెనక్కి పంపి నాలుగో వికెట్‌కు 71 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను ముగించాడు. సామ్ కరన్ (2) నిరాశపర్చాడు. 31 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన బ్రూక్, ఆర్చర్ (1) వెంటవెంటనే ఔటైనా.. విల్ జాక్స్ బ్యాట్ ఝుళిపించాడు. భారీ షాట్లతో 4, 6, 6, 6 దంచాడు. అతని జోరుకు చివరి మూడు ఓవర్లలో 45 రన్స్ రావడంతో ఇంగ్లండ్ మంచి స్కోరు చేసింది.
చివర్లో బోల్తా..
ఛేజింగ్ రెండో ఓవర్లో మూడు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన కుశాల్ (29) తర్వాతి ఓవర్‌లో 4, 6తో నేపాల్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. కానీ అవతలి వైపు ఆసిఫ్ షేక్ (7) నాలుగో ఓవర్లో, కుశాల్ఆరో ఓవర్లో వెనుదిరగడంతో నేపాల్ 42/2తో ఎదురీత మొదలుపెట్టింది. 47/2తో పవర్‌ప్లేను ముగించిన దీపేంద్ర, రోహిత్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఏడో ఓవర్‌లో దీపేంద్ర 4, రోహిత్ 6తో కుదురుకున్నారు.
8వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన దీపేంద్ర 10వ ఓవర్‌లో మరో ఫోర్, రోహిత్ బౌండ్రీతో స్కోరు 85/2కు పెరిగింది. ఇక్కడి నుంచి వేగంగా సింగిల్స్ తీసిన ఈ ఇద్దరు వీలైనప్పుడల్లా ఫోర్లు రాబట్టారు. 14వ ఓవర్‌లో రోహిత్ 6, దీపేంద్ర 4, 6తో 19 రన్స్ వచ్చాయి. కానీ 7 బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 82 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
126/4 వద్ద వచ్చిన లోకేశ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన అతను చివరి వరకు గెలుపు కోసం పోరాడాడు. 18వ ఓవర్‌లో ఆరిఫ్ షేక్ (10) సిక్స్ కొట్టి ఔట్‌కాగా లోకేశ్ రెండు సిక్సర్లు బాదాడు. 19వ ఓవర్‌లో లోకేశ్ 4, 4 కొట్టగా, లాస్ట్ బాల్‌కు గుల్షన్ ఝా (1) ఔటయ్యాడు. దాంతో విజయసమీకరణం 6 బాల్స్‌లో 10గా మారింది. సామ్ కరన్ వరుసగా యార్కర్స్ వేసి లోకేశ్, కరణ్ కేసీ (1 నాటౌట్)ని కట్టడి చేయడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది.
స్కోరు బోర్డు
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్ (సి) లామిచానె (బి) మల్లా 1, జోస్ బట్లర్ (సి) ఆసిఫ్ షేక్ (బి) యాదవ్ 26, జాకబ్ బెథెల్ (సి) లోకేశ్ బామ్ (బి) ఆరీ 55, టామ్ బాంటన్ (ఎల్బీ) లామిచానె 2, హ్యారీ బ్రూక్ (సి) మల్లా (బి) యాదవ్ 53, సామ్ కరన్ (బి) ఆరీ 2, విల్ జాక్స్ (నాటౌట్) 39, జోఫ్రా ఆర్చర్ (రనౌట్) 1, లియామ్ డాసన్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 184/7. వికెట్లపతనం: 1–5, 1–43, 3–57, 4–128, 5–137, 6–157, 7–178. బౌలింగ్: కరణ్ కేసీ 3–0–35–0, షేర్ మల్లా 3–0–35–1, దీపేంద్ర సింగ్ ఆరీ 3–0–23–2, నందన్ యాదవ్ 3–0–25–2, సందీప్ లామిచానె 4–0–25–1, కుశాల్ 4–0–40–0.
నేపాల్: కుశాల్ (సి అండ్ బి) జాక్స్ 29, ఆసిఫ్ షేక్ (సి) వుడ్ (బి) డాసన్ 7, రోహిత్ పౌడెల్ (సి) సాల్ట్ (బి) డాసన్ 39, దీపేంద్ర సింగ్ ఆరీ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 44, ఆరిఫ్ షేక్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 10, లోకేశ్ బామ్ (నాటౌట్) 39, గుల్షన్ జా (బి) వుడ్ 1, కరణ్ కేసీ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 180/6. వికెట్లపతనం: 1–37, 2–42, 3–124, 4–126, 5–146, 6–175. బౌలింగ్: ల్యూక్ వుడ్ 3–0–31–1, జోఫ్రా ఆర్చర్ 4–0–42–1, లియామ్ డాసన్ 4–0–21–2, విల్ జాక్స్ 2–017–1, ఆదిల్ రషీద్ 3–0–42–0, సామ్ కరన్ 4–0–27–1.
