ఎయిర్ పోర్టు సమీపంలో అండర్ గ్రౌండ్ మెట్రో

ఎయిర్ పోర్టు సమీపంలో అండర్ గ్రౌండ్  మెట్రో

హైదరాబాద్, వెలుగు: శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌ సమీపంలో 2.5 కి.మీ అండర్‌‌గ్రౌండ్‌‌ మెట్రో నిర్మిస్తామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రూ.6,250 కోట్లతో రాయదుర్గం టు శంషాబాద్ -ఎయిర్‌‌పోర్ట్‌‌ కారిడార్‌‌ నిర్మిస్తామన్నారు. ఈ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఐదో వార్షిక వేడుకలు మంగళవారం అమీర్‌‌‌‌పేట మెట్రో స్టేషన్‌‌లో ఘనంగా జరిగాయి. రెగ్యులర్​గా మెట్రోలో ప్రయాణిస్తున్న15 మంది ప్యాసింజర్లను గుర్తించి వారికి ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌‌అండ్‌‌టీ  ఎమ్‌‌ఆర్‌‌‌‌హెచ్‌‌ఎల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి  గిఫ్ట్ ఓచర్లు అందించి సత్కరించారు. ఫోన్‌‌పే ద్వారా మరో పది మంది ప్యాసింజర్లకు  కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ కింద గిఫ్ట్ వోచర్లను అందజేశారు.  ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఐదేండ్లలో తమతో కలిసి ఉన్న ప్యాసింజర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్  వరకు నిర్మించే ఎక్స్ ప్రెస్ మెట్రోని ఇప్పుడున్న మెట్రో కంటే మరింత అ త్యాధునికంగా, మరిన్ని సౌకర్యాలతో కడ్తామని పేర్కొన్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి 0.9 కి.మీ ట్రాక్ ని బయోడైవర్సిటీ వరకు పొడిగించిన తర్వాత ఎయిర్ పోర్టు మొదటి స్టేషన్ రాయదుర్గం వద్ద వస్తుందని వివరించారు. సిటీలోని వివిధ ఏరియాల నుంచి వచ్చే ప్యాసింజర్లు ఇక్కడ దిగి ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్కుతారని అన్నారు. అక్కడే లగేజీని చెక్ చేసి డైరెక్ట్ గా శంషాబాద్ విమానాశ్రయంలోని టర్మినల్ కు పంపుతామన్నారు. 31 కి. మీ దూరంలో బయోడైవర్సిటీ జంక్షన్ దాటి ఖాజాగూడ రూట్​లో నానక్ రాంగూడ వద్ద ఔటర్​లోకి ఎంటరై అక్కడి నుంచి ఓఆర్ఆర్ పక్క నుంచి శంషాబాద్ దాకా మెట్రో వెళ్తుం దన్నారు. ఎయిర్​పోర్టులోకి రీచ్ అయ్యాక రెండున్నర కి.మీ భూగర్భం మార్గంలో నేరుగా టర్మినల్ స్టేషన్​కు చేరుతుందని చెప్పారు. సింగపూర్, హాంకాంగ్, లండన్  నగరాలను ఇప్పటికే పరిశీలించామన్నారు. డిసెంబరు 9న సీఎం కేసీఆర్ పునాది వేసిన తర్వాత ఈపీసీ కాంట్రాక్ట్ ఇచ్చి, మూడేండ్లలో పనులు పూర్తిచేస్తామని తెలిపారు.

ఐదేళ్లలో 31 కోట్ల మంది ప్రయాణం

కరోనా తర్వాత మెట్రో పూర్వ స్థాయికి చేరుకుందని, సోమవారం 4.40 లక్షల ప్రయాణికుల ట్రిప్పులు నమోదయ్యాయని ఎల్అండ్ టీ హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఐదేళ్లలో 31 కోట్లకు పైగా ప్రయాణికులు మెట్రోలో ట్రావెల్  చేశారని ఆయన చెప్పారు. 210 మిలియన్ టన్నుల బొగ్గుపులుసు వాయువును వాతావరణంలో కలవకుండా మెట్రో నిలువరించిందని తెలిపారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రయాణికులకు మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆన్ లైన్లో  రీచార్జ్ తర్వాత కార్డులో అమౌంట్ చూపించేందుకు ఇది వరకు 2గంటలు పట్టేదని, ఇప్పుడు 20 నిమిషాలకు తగ్గించామని తెలిపారు. ఫోన్‌‌పే డైరెక్టర్ రీతురాజ్ రౌటేలా మాట్లాడుతూ 2020లో హైదరాబాద్ అంతటా డిజిటల్ క్యూఆర్ టికెట్‌‌లను ఎనేబుల్ చేయడానికి మెట్రో తో భాగస్వామ్యం చేసుకున్నామని తెలిపారు. వేడుకల్లో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ ని ప్రమోట్ చేసేందుకు తత్వా ఆర్ట్స్ సహకారంతో మెట్రో ఆధ్వర్యంలో నిర్వహించిన ఒగ్గుకథ, తబలా పెర్ఫామెన్స్ ఆకట్టుకున్నాయి.