పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి.. నిరుద్యోగ, ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ 

పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి.. నిరుద్యోగ, ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ 

బషీర్ బాగ్, వెలుగు : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ, ప్రైవేట్ పీఈటీల అసోసియేషన్ కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు సైదులు గౌడ్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కేజీ టు పీజీ వ్యాయమ విద్యపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  అధ్యక్షుడు సైదులు గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు బడికి దూరమై పాఠశాలలు మూతబడ్డాయని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా 616 పీఈటీ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని.. కానీ ఆరేండ్లు గడుస్తున్నా ఇంకా  పోస్టింగ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  వాటిని కొత్త  ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న పీఈటీ , పీడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను దశలవారీగా భర్తీ చేయాలన్నారు. పీఈటీ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో

ఉపాధి కల్పించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. పీఈటీ టీచర్లతో పాటు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని  కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. త్వరలోనే అసోసియేషన్ ప్రతినిధులతో  వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. పెండింగ్ పోస్టుల భర్తీతో పాటు కొత్త పోస్టుల భర్తీ పై ప్రకటన చేయిస్తామని హామీ ఇచ్చారు.