మెగా డీఎస్సీ.. వెయ్యాల్సిందే

మెగా డీఎస్సీ.. వెయ్యాల్సిందే
  • ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో వక్తలు, నిరుద్యోగుల డిమాండ్

మెగా డీఎస్సీ వేసి 24 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్​ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు  మంగళవారం హైదరాబాద్​లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. 13,086 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో  కేసీఆర్ ప్రకటించారని, కానీ కేవలం 5,089 పోస్టులు వేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. 33 జిల్లాల వారీగా రోస్టర్ ప్రకారం విభజిస్తే.. కేటగిరీ పరంగా ఒకటి, రెండు పోస్టులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  దాదాపు 6 లక్షల మంది డీఈడీ, బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ కోసం ఎదురు చూస్తుంటే.. మినీ డీఎస్సీ వేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముషీరాబాద్, వెలుగు : మినీ డీఎస్సీ వద్దని.. మెగా డీఎస్సీ వేసి 24వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్​కు మధ్య కొంత టైమ్ ఇవ్వాలని కోరారు. అప్పుడే ప్రిపరేషన్​కు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ మేరకు మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద అభ్యర్థులు ధర్నా చేపట్టారు. ఈ ప్రోగ్రామ్​కు ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీఎస్పీ స్టేట్ చీఫ్ ప్రవీణ్​కుమార్, టీజేఎస్ చీఫ్ కోదండరాం హాజరై మాట్లాడారు. పోటీ పరీక్షల మధ్య కొంత టైమ్ ఇవ్వాలనే ఆలోచన అటు కేటీఆర్ కు, ఇటు టీఎస్​పీఎస్సీ అధికారులకు రావడం లేదా

అని ప్రశ్నించారు. వెంటవెంటనే పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు టైమ్ సరిపోవడం లేదన్నారు. డీఎస్సీ కనీసం 4నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. 5,089 టీచర్ పోస్టులకు రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. 33 జిల్లాల వారీగా రోస్టర్ ప్రకారం విభజిస్తే.. కేటగిరీ పరంగా ఒకటి, రెండు పోస్టులు కూడా రావడం లేదని విమర్శించారు. లక్షల్లో నిరుద్యోగులు ఉన్నారని, పోస్టులు మాత్రం చాలా తక్కువగా రిలీజ్ చేశారని మండిపడ్డారు. దాదాపు 6లక్షల మంది డీఎడ్, బీఈడీ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటే.. మినీ డీఎస్సీ వేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13,086 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు గుర్తించి.. మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ రిపోర్ట్ ప్రకారం

రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ 24 వేల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, వెంటనే మెగా డీఎస్సీ వేయకపోతే ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు. నీల వెంకటేశ్, గుజ్జ కృష్ణ, రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన చేపట్టిన ధర్నాలో.. నిరుద్యోగులు, విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.