టీచర్ నోటిఫికేషన్ రావట్లేదని యువకుడి ఆత్మహత్య

టీచర్ నోటిఫికేషన్ రావట్లేదని యువకుడి ఆత్మహత్య

టెట్ లో క్వాలీఫై అయి ఏండ్లు గడుస్తున్నా టీచర్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రాలేదన్న మనస్తాపంతో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది ఈ ఘటన. కోరపల్లి గ్రామానికి చెందిన గుండారి సదానందచారికి ముగ్గురు కొడుకులు. ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసిన రెండో కొడుకు విష్ణువర్ధనాచారి(31)కి ఇంకా ఉద్యోగం రాలేదు.

నిరుడు నిర్వహించిన టెట్‌‌లో మంచి స్కోర్ సాధించిన విష్ణువర్ధనాచారి.. టీఆర్టీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ఎంతకీ నోటిఫికేషన్​ రాకపోవడం, ఉద్యోగాలు సాధించిన అన్నదమ్ములిద్దరికీ పెండ్లిళ్లు కావడంతో మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. నెల రోజుల వ్యవధిలోనే కోరపల్లి గ్రామంలో విద్యావంతులైన ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.