యాప్స్,  ఆన్ లైన్ లో క్లాసులు వింటున్న నిరుద్యోగులు

యాప్స్,  ఆన్ లైన్ లో క్లాసులు వింటున్న నిరుద్యోగులు

యాప్స్,  ఆన్ లైన్ లో క్లాసులు వింటున్న నిరుద్యోగులు

  • ఆఫ్‌‌లైన్‌‌తో పోలిస్తే ఆన్‌‌లైన్‌‌లో తక్కువ ఫీజులు
  • సబ్జెక్టును బట్టి రూ.500 నుంచి రూ.10 వేలు వసూలు
  • రూమ్ రెంట్స్, హాస్టల్ ఫీజులు, సమయం ఆదా
  • ఇప్పటికే అందుబాటులోకి టీశాట్ ఉచిత పాఠాలు
  • ఫ్రీ కోచింగ్ యాప్స్‌‌ సిద్ధం చేస్తున్న పోలీస్, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలు

హైదరాబాద్, వెలుగు :  ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకోవాల్నంటే.. సిటీకి పోవాలె.. రూమ్​ లేదా హాస్టల్​లో ఉండాలె.. వేలకు వేలు ఫీజులు కట్టాలె.. వందల మందితో కలిసి ఫంక్షన్ హాళ్లలో కూర్చుని క్లాసులు వినాలె.. రావాలె.. పోవాలె.. ఇంతుంటది కథ!! ఈ తక్లీఫ్ పడలేక, ఖర్చులు భరించలేక చాలా మంది నిరుద్యోగులు ఇంటి దగ్గరే ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు. తక్కువ ఫీజులతోనే యాప్‌‌లో ఆన్‌‌లైన్ పాఠాలు వినేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఖర్చులు తగ్గిపోతాయని, సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు. కోచింగ్ సెంటర్లలో అంతమంది మధ్య ఇబ్బందులు పడుతూ క్లాసులు వినడం కంటే.. ఆన్‌‌లైన్ పాఠాలు బెటర్ అని అనుకుంటున్నారు. ఆన్‌‌లైన్ కోచింగ్‌‌కు సబ్జెక్టును బట్టి ఆయా సెంటర్లు రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫీజులు కట్టలేని వాళ్ల కోసం టీశాట్ ద్వారా ఇప్పటికే ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభమవ్వగా.. పోలీస్, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలు కూడా ఫ్రీ కోచింగ్ యాప్‌లను రెడీ చేస్తున్నాయి.

భారీ ఫీజులు కట్టలేక..

జాబ్ నోటిఫికేషన్లను త్వరలో విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కోచింగ్ బాటపట్టారు. దీంతో ఆయా సెంటర్లలో అడ్మిషన్లు ఫుల్ అవుతున్నాయి. అభ్యర్థులందరికీ సరిపోను క్లాసు రూమ్స్‌ లేకపోవడంతో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఫంక్షన్ హాళ్లను అద్దెకు తీసుకుని ఒకే చోట వెయ్యి మంది నుంచి 2 వేల మందిని కూర్చోబెడుతున్నారు. దీన్ని చాలా మంది నిరుద్యోగులు అసౌకర్యంగా భావిస్తున్నారు. వేలకు వేలు కట్టి, క్లాసులు సరిగ్గా అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా డౌట్ వచ్చినా అడిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిని డెమో క్లాసుల్లోనే గమనించడం, ఆఫ్‌లైన్ కోచింగ్ కంటే ఆన్‌లైన్ కోచింగ్‌కు సగానికన్నా తక్కువ ఫీజు ఉండడంతో చాలా మంది నిరుద్యోగులు ఆయా ఇన్‌స్టిట్యూట్లకు చెందిన యాప్స్‌ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్ తదితర నగరాల్లో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్లలో నిపుణులు చెప్పే పాఠాలను ఇంటి దగ్గరి నుంచే వింటున్నారు. క్లాసులకు, స్టడీ మెటీరియల్‌కు ఫీజు చెల్లిస్తున్నారు. పెద్ద పెద్ద సెంటర్లలో క్లాసులు వినాలనుకునే వాళ్లకు ఆయా సంస్థల యాప్‌లు ఆ లోటును తీరుస్తున్నాయి. లైవ్​ క్లాస్​లు, ప్రీ రికార్డెడ్​ వీడియోలు అందుబాటులో ఉంచుతున్నాయి. ఇంట్లో నుంచి పాఠాలు వినడంతో రూమ్ రెంట్స్, హాస్టల్ ఫీజుల​భారం నుంచి నిరుద్యోగులకు ఉపశమనం కలుగుతోంది.

టీశాట్‌ పాఠాలు సాయమైతున్నయ్

నిరుద్యోగుల కోసం టీ-శాట్ ఆయా నోటిఫికేషన్ల సిలబస్‌కు అనుగుణంగా నిపుణులతో వీడియో పాఠాలు సిద్ధం చేస్తోంది. టీవీ, సోషల్‌ మీడియా, యాప్‌ ద్వారా ఫ్రీగా కోచింగ్‌ను ఇప్పటికే ప్రారంభించింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్‌ను ఇప్పటి వరకు 30 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం జనరల్‌ స్టడీస్‌, చరిత్ర, ఎకానమీ, రీజనింగ్‌, గణిత సామర్థ్యం, ఇంగ్లిష్‌, జనరల్‌ సైన్స్‌ సబ్జెక్టుల పాఠాలను బోధిస్తున్నారు. టీశాట్‌ మొబైల్‌, వెబ్‌ అప్లికేషన్లలో అభ్యర్థులు మొబైల్‌ నంబరు ద్వారా లేక గూగుల్, ఫేస్​బుక్ అకౌంట్లతో రిజిస్టర్‌‌ చేసుకుంటే మాక్‌ టెస్ట్‌ రాయడానికి అవకాశం ఉంటుంది. 

పోలీస్ శాఖ ఫ్రీ కోచింగ్

నిరుద్యోగులకు ఫ్రీగా కోచింగ్ ఇచ్చేందుకు పోలీస్, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలు ముందుకొచ్చాయి. రెండు, మూడు నెలల నుంచే పోలీసు శాఖ చాలా జిల్లాల్లో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ఫ్రీ కోచింగ్ ఇస్తోంది. డీజీపీ ఆదేశాలతో తాజాగా మరికొన్ని కోచింగ్ సెంటర్లు తెరిచి, అడ్మిషన్లు ఇచ్చేందుకు అభ్యర్థులకు అర్హత పరీక్ష పెడుతున్నారు. సెంటర్లకు రాలేని వారు ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు యాప్ రూపొందిస్తున్నారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్స్ కూడా అభ్యర్థులకు ఫ్రీకోచింగ్ ఇచ్చేందుకు స్క్రీనింగ్ టెస్టులు పెడుతున్నాయి. లక్ష మందికి పైగా అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వబోతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రకటించింది. 16 స్టడీ సెంటర్ల ద్వారా 50 వేల మంది బీసీ అభ్యర్థులకు ఆఫ్‌లైన్‌లో, మరో 50 వేల మందికి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు చెప్పింది.

వేలల్లో ఖర్చు పెట్టలేక..

ఎంఏ తెలుగు, బీఈడీ పూర్తి చేసిన. నాలుగేండ్లుగా టెట్, టీఆర్టీ కోసం ఎదురు చూస్తున్న. ఇపుడు నోటిఫికేషన్ రావడంతో ప్రిపేర్ అవుతున్న. వేలల్లో ఖర్చు పెట్టి  కోచింగ్​ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. అందుకే స్టడీ మెటీరియల్ కొని చదువుతున్న. హైదరాబాద్‌లో కోచింగ్​కు పోవాలంటే  రూ.8 వేలు ఫీజు కట్టాలె. రూ. వెయ్యి కట్టి ఓ కోచింగ్ సెంటర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, ఊర్లనే ఉంటూ పాఠాలు వింటున్నా. 
- ‌‌‌‌గంధసిరి రాజేశ్‌, అర్పనపల్లి, మహబూబాబాద్

ఆన్‌లైన్‌లో క్లాసులు వింటున్న

గ్రూప్స్ కోసం హిస్టరీ, పాలిటీ సబ్జెక్టులు సొంతంగానే ప్రిపేర్ అవుతున్న. ఎకానమీ సబ్జెక్టుకు కోచింగ్ తీసుకోవాలనుకున్న. ఈ ఒక్క సబ్జెక్టు కోసం కోచింగ్‌కు పోతే రూ.15 వేల దాకా అడుగుతున్నారు. అందుకే హైదరాబాద్ అశోక్ నగర్‌‌లోని ఓ కోచింగ్ సెంటర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని క్లాసులు వింటున్న. రూ.1,500తో ఇంటి దగ్గరే ఉండి నాకు వీలైన టైంలో ఎకానమీ క్లాసులు వింటున్న. ఒక్క సబ్జెక్ట్ కోసం హైదరాబాద్ వెళ్లే బాధ తప్పింది.
- ఎన్.వెంకటేశ్వర్లు, కాజీపేట