మోసపోతున్న నిరుద్యోగులు

మోసపోతున్న నిరుద్యోగులు

భారతదేశంలోని యువతలో చదువుకున్నవారు 75.8% మంది ఉండగా వీరిలో నిరుద్యోగులుగా ఉన్నవారు 42.3శాతం. మిగతావారిలో రక్షణ సిబ్బంది మినహా 2,15,47,845 మంది రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు 5.4 మిలియన్లు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకున్న యువత చాలావరకు నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఇటువంటి వారిని టార్గెట్ చేస్తూ ఐటీ రంగంలో అనేక మోసాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా మన తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో, ఐటీ హబ్​గా పిలిచే బెంగళూరు నగరంలో  మోసాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో 9 లక్షల ఐటీ ఉద్యోగులు ఉండగా 3 నుంచి 5 లక్షలు నాన్ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. హైదరాబాద్ నగరంలోనే వీరు ఎక్కువగా ఉన్నారు. కర్నాటకలో కూడా తెలంగాణ కంటే 5 శాతం ఎక్కువ. కర్నాటక రాజధాని నగరమైన బెంగళూరులోనే ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు.

 గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువకులంతా ఎక్కువగా ఐటీ రంగంపై ఆసక్తి చూపుతున్నారు.  మోసగాళ్లకు ఈ నిరుద్యోగులే టార్గెట్​గా మారుతున్నారు. అరచేతి వైకుంఠం చూపుతున్నారు. జాబ్ క్లాస్​ల పేరిట డబ్బు లాగుతున్నారు. మోసపూరితంగా ఇంటర్వ్యూలలో ఉద్యోగానికి ఎంపిక చేస్తున్నారు. తీరా స్కిల్స్​ లేక ఉద్యోగం కోల్పోతున్నారు.
 
మోసాలతో వంచిస్తున్నారు

కొంతమంది మోసగాళ్లు నిరుద్యోగుల బలహీనతను డబ్బుగా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఎక్కువగా ఈ మోసాలు ప్రాక్సీపేరుతో జరుగుతున్నాయి. జాబ్ గురించి ఎటువంటి క్లాసులు చెప్పకుండా. నెల రోజులు క్లాసులు చెప్తున్నామనే విధంగా టైం పాస్ చేసి చివరకు ఫేస్ క్యాండిడేట్ ది పెట్టి వీళ్లు ఇంటర్వ్యూ క్లియర్ చేసి జాబ్​కి పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లాక వర్క్ ఏం తెలియక నెలరోజుల్లోనే జాబ్ కోల్పోతున్నారు. ఇలా ఉద్యోగంలో పెట్టినందుకుగాను..రూ.1.50లక్షల నుంచి రూ. 2 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత ఉద్యోగం కోసం వెనకా ముందు ఆలోచించకుండా డబ్బులు కట్టేస్తున్నారు. నెల రోజుల్లో జాబ్ పోవడంతో ఏమీ చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. జాబ్​లో పెట్టిన వ్యక్తికి ఫోన్ చేస్తామంటే వారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో, జాబ్ వచ్చిన నెల రోజుల్లోనే  పోయిందని ఇంట్లో చెప్పలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొంతమంది సిటీలోనే ఉంటూ స్విగ్గి, జొమాటో, రాపిడో లాంటివి చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దయచేసి దీనిపై పత్రికలుగానీ, ప్రభుత్వాలుగానీ నిరుద్యోగులకు అవగాహన కల్పించాలి. వెళ్లే జాబ్​కు సంబంధించిన పూర్తి కోచింగ్ ఇచ్చే మంచి ఇన్​స్టిట్యూట్ గురించి తెలిసేలా చేయాలి. ఇటువంటి మోసం చేసే కేటుగాళ్లను కనిపెట్టి అరెస్టు చేసి ఇంకెవరికీ
ఈ విధంగా జరగకుండా చూడాలి.

-  సాయికృష్ణ కొత్తకొండ,ఎల్​ఎల్​బీ విద్యార్థి