హుజూరాబాద్​లో నిరుద్యోగుల భిక్షాటన

హుజూరాబాద్​లో నిరుద్యోగుల భిక్షాటన

హుజూరాబాద్,​ వెలుగు: కేసీఆర్ బోగస్ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్ అన్నారు. హుజూరాబాద్​లో మంగళవారం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగ ఉద్యమకారులు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్​కు నిరుద్యోగులు, నోటిఫికేషన్లు గుర్తుకు వస్తాయన్నారు. ఆంధ్రావాళ్లు వెళ్లిపోతే దాదాపు 2.5 లక్షల ఖాళీలు ఏర్పడతాయని, అవన్నీ తెలంగాణ నిరుద్యోగులకు వస్తాయని అప్పట్లో హరీశ్​రావు చెప్పారన్నారు. తెలంగాణ ఏర్పడి ఏడేండ్లు అవుతున్నా ఆ ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదో హుజూరాబాద్ ప్రజలకు హరీశ్​రావు చెప్పాలన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు.  ఈసారి మోసపోవడానికి తాము సిద్ధంగా లేమని రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ, విద్యార్థి, దళిత సోదరులంతా హుజూరాబాద్ లో ఇంటింటి ప్రచారం చేస్తామని హెచ్చరించారు.  హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని.. లేదంటే హుజూరాబాద్ కు వచ్చే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు.