రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం..పట్టించుకోని సర్కార్

రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం..పట్టించుకోని సర్కార్

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా మారుతున్నా ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టడంలేదు. నిరుద్యోగ భృతితో పాటు వివిధ కార్పోరేషన్ల కింద లోన్స్ ఇస్తామని చెప్పి ఏళ్ళు గడుస్తున్నా నేతల హామీలు నెరవేరలేదు.  సబ్సిడీ లోన్ల కోసం కార్పోరేషన్లలో అప్లికేషన్స్ పెట్టిన లక్షల మంది కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దళిత బంధు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా... ఎస్సీల్లో ఒక్క శాతం మందికి కూడా ఆ పథకం వచ్చే పరిస్థితి లేదు. 

రాష్ట్రంలో 20 లక్షలకు పైగా నిరుద్యోగులు

నీళ్లు, నిధులు, నియామకాలతో రాష్ట్రం ఏర్పడగా ప్రభుత్వం వాటిని పక్కన పెట్టిందనే విమర్శలొస్తున్నాయి. ఇప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిరుద్యోగ సమస్యపై సీరియస్ గా దృష్టి పెట్టడం లేదంటున్నారు. TSPSC లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగులు 20 లక్షల మందికి పైగా ఉన్నారు. అయితే అంతకంటే ఎక్కువే ఉన్నట్టు రోజూ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ కు వచ్చేవారిని చూస్తే అర్థమవుతుంది. . 

నియోజకవర్గంలో 100 మందికే దళితబంధు

ప్రభుత్వ కొలువులు ఇవ్వలేకపోయినా ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్య తీరుస్తామనీ... ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చూస్తామని నేతలు చెప్పే మాటలు నీళ్లమీద రాతలే  అయ్యాయి. గత ప్రభుత్వాల టైంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన యువతకు ఆయా కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీతో రుణాలు ఇచ్చేవారు. కానీ రాష్ట్రం ఏర్పాటై 8 ఏళ్లయినా ఇంత వరకూ ఎవరికీ రుణాలు రాక పోగా, ఎస్సీలకు 3 ఎకరాల భూమి కూడా అటకెక్కింది. ఈ మధ్య ఆర్భాటంగా ప్రకటించిన దళితులకు 10 లక్షల దళిత బంధు కూడా కొంతమందికే ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గానికి 100 మంది ఎస్సీలకే ఇస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తాము లోన్ కోసం అప్లై చేసుకొని చాలా రోజులైనా ఇవ్వలేదని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీసీ, ఎస్టీలకు కూడా ఇంత వరకూ ఎలాంటి ఉపాధి చూపకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. 2015లో ప్రభుత్వం కొద్ది మందికి 50 వేల చొప్పున ఇచ్చింది . కానీ ఇంకా 6 లక్షలకు పైగా అభ్యర్థులు కార్పోరేషన్ లోన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల టైంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ  ఎటు పోయిందని ప్రశ్నిస్తున్నారు. కొలువులు లేక  బతికేందుకు ఉపాధి లేక నిరాశతో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రాష్ట్రంలో సబ్సిడీ రుణాల కోసం ఎదురు చూసే యువతతో పాటు వివిధ కులవృత్తుల వారు కూడా ప్రభుత్వ  సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొంతకాలంగా  కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించి లీడర్లకు ఉపాధి కల్పిస్తున్నప్రభుత్వం నిరుద్యోగులకు మాత్రం మేలు చేయట్లేదని మండిపడుతున్నారు.