యూనిఫామ్​ ఆర్డర్లు నేతన్నలకే

యూనిఫామ్​ ఆర్డర్లు నేతన్నలకే

నీలగిరి, వెలుగు: భవిష్యత్ లో అవసరమైతే ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికుల యూనిఫామ్ ల తయారీ ఆర్డర్​ను చేనేత కార్మికులకు అందజేస్తామని, దీని కోసం ఆయా సంస్థలతో మాట్లాడుతామని మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పోచంపల్లి, దుబ్బాక, నల్గొండ, గద్వాల, సిరిసిల్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న నేతన్నల జీవితాలలో విశ్వాసం నింపి మెరుగైన జీవనోపాధి కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్ యార్డ్ ఆవరణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏక కాలంలో కోటి చీరల పంపిణీ కార్యక్రమం నల్గొండ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 50 % సబ్సిడీతో నేతన్నలకు ముడిసరుకులు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు. బతుకమ్మ చీరల తయారీ ద్వారా రాష్ట్రంలో నేత కార్మికుల ఆదాయం రెట్టింపైందన్నారు. వారంలో ఒక రోజు అందరూ చేనేత వస్త్రాలు ధరించే విధంగా ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని కేటీఆర్​ పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక పెద్దన్నలాగ, ఆప్తుడిగా మహిళలందరికీ అందిస్తున్న చిరుకానుక బతుకమ్మ చీరల పంపిణీ అని తెలిపారు.

త్వరలో మల్కాపూర్ ప్రాంతంలో అతి పెద్ద పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని, దీని ద్వారా సుమారు 12 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా నేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. పానగల్ కు రూ. 35 కోట్లు మంజూరు చేసి మినీ ట్యాంక్ బండ్ నిర్మింపజేస్తామని, రాబోయే రోజుల్లో అక్కడే బతుకమ్మ సంబురాలు చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. చేనేత కార్మికులకు చెక్కులు, కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులను ఆయన అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిల్​ చైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.