చిన్నారుల్లో మెదడువాపు వ్యాధి: 93కు చేరిన మృతుల సంఖ్య

చిన్నారుల్లో మెదడువాపు వ్యాధి: 93కు చేరిన మృతుల సంఖ్య

మెదడువాపు వ్యాధి కారణంగా బిహార్ లోని ముజఫర్ నగర్ లో చనిపోయిన చిన్నారుల సంఖ్య 93కు చేరింది. గత వారం రోజులుగా ముజఫర్ నగర్ లో చిన్నారులు తీవ్ర మెదడు వాపుతో చనిపోతూనే ఉన్నారు. శ్రీ కృష్ణా మెడికల్ కాలేజీ హాస్పిటల్ , కేజ్రీవాల్ హాస్పిటల్ మెదడువాపు వ్యాధితో వచ్చిన పిల్లలతో నిండిపోయింది. మరో 12 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు చిన్నారులకు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ .. ముజఫర్ నగర్ వచ్చి పరిస్థితిని సమీక్షించారు. శ్రీ కృష్ణా మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న రోగులను పరామర్శించారు. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ను అడ్డుకునేందుకు జన్ అధికార పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు.