గతేడాదితో పోలిస్తే పెరిగిన కేంద్ర పన్నుల వాటా

గతేడాదితో పోలిస్తే పెరిగిన కేంద్ర పన్నుల వాటా
  • సెంట్రల్​ స్పాన్సర్డ్ స్కీములతో 10 వేల కోట్లపైనే రాక
  • ఫైనాన్స్ కమిషన్ నిధులు, గ్రాంట్లు మరో రూ.3 వేల కోట్లు
  • ఐఐటీ హైదరాబాద్, సింగరేణి, బీబీనగర్ ఎయిమ్స్​కూ ఫండ్స్

హైదరాబాద్, వెలుగు: కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త బడ్జెట్ ప్రకారం వచ్చే ఫైనాన్షియల్ ఇయర్​(2023–24)లో రాష్ట్రానికి రూ.38 వేల కోట్ల వరకు అందనున్నాయి. కేంద్ర బడ్జెట్‌‌లో కొత్త వరాలు లేకపోవటం ఈసారి తెలంగాణను నిరుత్సాహపరిచింది. ఏటా కేంద్రం నుంచి పన్నుల వాటాతోపాటు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌‌ల నిధులు రాష్ట్రాలకు అందుతాయి. సెంట్రల్ జీఎస్టీ, ఇన్​కమ్ ట్యాక్స్, సీజీఎస్టీ, కస్టమ్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్‌‌ల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు 10.21 లక్షల కోట్లను కేంద్రం పంపిణీ చేయనుంది. అందులో నిర్ణీత వాటా ప్రకారం 2.102% నిధులు.. అంటే రూ.21,470 కోట్లు తెలంగాణకు వస్తాయి. గతేడాదితో పోలిస్తే కేంద్ర పన్నుల వాటా ఎక్కువే వస్తుంది. బీబీ నగర్ ఎయిమ్స్, ట్రైబల్ వర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి, మణుగూరు, కోట భారజల ఫ్యాక్టరీలతో పాటు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ నిధులు తెలంగాణకు రానున్నాయి. అయితే ఈసారి జీఎస్టీ పరిహారం లేదు. ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా కొంత మేర తగ్గినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. నీతి అయోగ్, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా మిషన్ భగీరథ వంటి వాటికి బడ్జెట్‌‌‌‌లో కేటాయింపులు జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాజీపేట వ్యాగన్‌‌‌‌ కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నవోదయ విద్యాలయాల అంశాలకు బడ్జెట్‌‌‌‌లో చోటు దక్కలేదు.

మణుగురు హెవీ వాటర్ ఫ్యాక్టరీకి 750 కోట్లు

కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి రాష్ట్రాలకిచ్చే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నిధులు ఈసారి దాదాపు రూ.10,500 కోట్ల మేర వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ నిధులు కూడా ఉండనున్నాయి. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థల గ్రాంట్లతో పాటు హెల్త్ గ్రాంట్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లతోపాటు ఇతర నిధులు అన్నీ కలిపితే నిరుటి కంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.1,500 కోట్ల నుంచి 2 వేల కోట్ల మేర పెరిగే అవకాశముంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.2,167 కోట్ల గ్రాంట్ రిలీజ్ కానుంది. ఈ ఏడాది హెల్త్ గ్రాంట్ కింద రూ.441 కోట్లు, డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్ కింద రూ.495 కోట్లు రానున్నాయి. ట్రైబల్ వర్సిటీకి రూ.18 కోట్లు, బీబీ నగర్ ఎయిమ్స్‌‌‌‌కు రూ.310 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌‌‌‌కు రూ.300 కోట్లు, మణుగూరు హెవీ వాటర్ ఫ్యాక్టరీకి రూ.750 కోట్ల మేర విడుదలవుతాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి  రూ.60 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో భారీ అంచనాలు వేసుకుంది. ఇప్పటివరకు అందులో సగం నిధులు కూడా రాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టారీతి అంచనాలతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెప్తున్నారు. ఆర్థిక సంవత్సరానికి మరో రెండు నెలలు మాత్రమే మిగిలిఉండటంతో కేంద్రం ఇచ్చే నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు వదులుకుంది. కొత్త బడ్జెట్‌‌‌‌లో ప్రత్యేక గ్రాంట్లు, కేటాయింపులుంటాయనే అంచనాలు చెదిరిపోయాయి.

కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇలా.. 

కేంద్ర పన్నుల వాటా–రూ.21,470 కోట్లు
బీబీ నగర్ ఎయిమ్స్​–రూ.300 కోట్లు
ట్రైబల్ యూనివర్సిటీ–రూ.18 కోట్లు
కేంద్ర స్కీములు–రూ.10,500 కోట్లు
15వ ఫైనాన్స్ కమిషన్–రూ.3,000 కోట్లు
సింగరేణి –రూ.1,650 కోట్లు
ఐఐటీ హైదరాబాద్‌‌‌‌ –రూ.300 కోట్లు
మణుగూరు హెవీ వాటర్ ఫ్యాక్టరీ –రూ. 750 కోట్లు
ఇతరాలు –రూ.450 కోట్లు